Minister Kandula Durgesh: మన రాష్ట్రం సినిమాటోగ్రఫీకి అనేక విధాలుగా తోడ్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కోనసీమ , కృష్ణా పర్యాటక ప్రాంతాల్లో అనేక షూటింగులు జరిగాయని.. గత పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కేరళ నుంచి కోనసీమను అభివృద్ధి చేసేవాళ్లని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్‌లకు ఉపయోగించుకుంటామన్నారు. నిర్మాతలకు ఆహ్వానం పలుకుతున్నామని… ఏపీలో స్టూడియోలు నిర్మాణం చేయటానికి ముందుకు రావాలని మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానించారు. ఏపీ మంచి వనరులున్న రాష్ట్రమని.. అధికార యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం , అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామన్నారు. రెండు కోట్ల 31 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బోట్ షికార్ ఫైల్‌పై మొదటి సంతకం పెట్టానని మంత్రి చెప్పారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.
Read Also: Gannavaram Airport: సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలోకి గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రత.. డీజీపీకి లేఖ
పర్యాటక ప్రాంతాలుగా విరజిల్లాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. భవిష్యత్‌లో పర్యాటక, సాంస్కృతిక విధానాలను సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు ఉంటాయన్నారు. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. రిషికొండలో జగన్ నిర్మించిన ప్యాలెస్ కి బదులు పేదవాళ్ల కోసం ఓ హాస్పిటల్ నిర్మిస్తే రాష్ట్ర ప్రజలకు ఉపయోగంగా ఉండేదన్నారు. మా ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదు గాని, చేసిన తప్పుకు చర్యలు, శిక్షలు మాత్రం ఉంటాయని మంత్రి పేర్కొన్నారు, లేకపోతే తప్పులు చేయటం అలవాటుగా మారిపోతుందన్నారు. సినీ రంగ పెద్దలతో మాట్లాడి, సినీ రంగానికి ఊతం ఇచ్చే విధంగా మా చర్యలు ఉంటాయన్నారు. సినీ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.