తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎలక్ట్రిక్ బైకుపై నడుపుతున్న ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ‘ఈవీ ట్రేడ్ ఎక్స్‌పో’ పేరిట జరిగిన విద్యుత్ వాహనాల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన ఎలక్ట్రిక్ బైకును నడుపుతూ ట్రయల్స్ వేశారు. వాయు, శబ్ద కాలుష్యాన్ని ఈ-బైక్స్ ద్వారా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారికి ట్యాక్స్ మినహాయింపులతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు ప్రభుత్వం చేయూత అందిస్తుందని ఆయన తెలిపారు.
Read Also: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృవియోగం
మనం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామో.. అంతేవేగంగా ఆరోగ్యం పాడుచేసుకుంటున్నామని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందువల్ల కాలుష్యానికి కారణమైన పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాలను ఇప్పటికైనా తగ్గించాలని ప్రజలను కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలతో మన ఖర్చు తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం తెలంగాణలోని అన్ని జాతీయ రహదారులపై ప్రతి 25 కి.మీ.కు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెడతామని మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు.