NTV Telugu Site icon

Harish Rao : మన మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పని చేద్దాం

Harish Rao

Harish Rao

నిమ్స్, ఎంఎన్ జే ఆసుపత్రుల పనితీరుపై MCRHRD నుండి జూమ్ ద్వారా ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పిల్లల్లో జన్యులోపాలు నివారించేలా ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేయాలి, నివేదిక ఇవ్వాలన్నారు. ఈ మేరకు నిమ్స్ జెనిటిక్స్ విభాగం, జేడి మేటర్నల్ హెల్త్ కు ఆదేశాలు జారీ చేశారు హరీష్ రావు. ఓపీ పెరుగుదలకు అనుగుణంగా కౌంటర్లు పెంచాలని, ఈఎండీలో బెడ్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసి, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాలని, ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షలు ఇస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవయవదానంపై అవగాహన పెంచాలని, బ్రెయిన్ డెడ్ నిర్ధారణ కేసుల్లో అవయవదానం చేసేలా ప్రోత్సహించాలన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. అవసరం అయితే నేను కూడా స్వయంగా ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించేందుకు సిద్దమన్నారు హరీష్‌ రావు. ‘నిమ్స్ అధ్వర్యంలో స్పోక్ మోడల్ లో వివిధ జిల్లాల్లో ఉన్న డయాలసిస్ సెంటర్లను మానిటరింగ్ చేయాలి. సమస్యలు లేకుండా చూడాలన్నారు.
Also Read : Ajay Kallam: గడువులోగా సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోండి..

ఎం ఎన్ జే కేన్సర్ ఆసుపత్రిలో 300 పడకల కొత్త బ్లాక్ వచ్చే వారంలో ప్రారంభిస్తాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్కోవాలి. ఇది అందుబాటులోకి వస్తే మొత్తం 750 పడకలు కేన్సర్ చికిత్స కోసం అందుబాటులో ఉంటాయి. పాలియేటివ్ సేవల గురించి అవగాహన కల్పించి, ఎక్కువ మందికి సేవలు అందేలా చూడాలి. మొబైల్ స్క్రీనింగ్ బస్ ద్వారా నిర్వహించే క్యాంపుల సంఖ్య పెంచాలి. మారుమూల ప్రాంతాల్లోనూ వీటిని నిర్వహించాలి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సీఎం కేసీఆర్ గారు మనకు అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నారు. అడిగిన అన్ని ఇస్తున్నారు. మన మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా పని చేద్దాం. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడం, వారిని బాగా చూసుకోవడం మన బాధ్యత. పేషెంట్లు, వారి సంబంధీకులతో సెక్యూరిటీ, నాల్గవ తరగతి ఉద్యోగులు గౌరవంగా మెలగాలి.’ అని ఆయన వెల్లడించారు.