NTV Telugu Site icon

Harish Rao: బీజేపీ కేసీఆర్‌ను తట్టుకోలేక కాంగ్రెస్‌తో చేతులు కలిపింది..

Harish Rao

Harish Rao

Harish Rao: సంగారెడ్డి గడ్డపై ఈ సారి గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్ని గ్రామాల్లో తిరిగారని ఆయన ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు ప్రసంగించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరికతో బీజేపీ, కాంగ్రెస్ స్నేహ బంధం బట్టబయలు అయ్యిందన్నారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు ఇద్దరు ఏ పార్టీలో ఉన్న ఒకరికి ఒకరి గెలుపు కోసం పని చేస్తారని మంత్రి అన్నారు. ఢిల్లీలో రెండు పార్టీల మధ్య స్నేహ బంధం బయటపడిందన్నారు.

Also Read: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ పిచ్చి తుగ్లక్ డిజైన్.. న్యాయ విచారణకు కేసీఆర్ సిద్ధమా?

తెలంగాణలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు అయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పని చేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి రోజు మాట్లాడుకుంటున్నారని.. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా ఎవరిని పంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీ పార్టీ కేసీఆర్‌ను తట్టుకోలేక కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని నీరుగార్చడానికి రెండు పార్టీలు ఎన్నో కుట్రలు చేశాయన్నారు. రాహుల్ గాంధీ ఉంటే నరేంద్ర మోడీకి బలం అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారన్నారు మంత్రి హరీశ్. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు తెలంగాణ శక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే విషం చిమ్మే పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అన్నం పెట్టే నాయకుడు కేసీఆర్.. సున్నం పెట్టే పార్టీ ప్రతిపక్షాలు అంటూ వ్యాఖ్యాంచారు. పొరపాటున కాంగ్రెస్‌కి ఓటేస్తే 60 ఏళ్ల కిందికి తెలంగాణ పోతుందన్నారు. మూడో సారి కేసీఆర్‌ను గెలిపించుకోకపోతే రాష్ట్రం ఆగం అవుతుందన్నారు మంత్రి హరీశ్ రావు.