NTV Telugu Site icon

Vizag Steel Plant: ఆ విషయం బీఆర్ఎస్‌ స్పష్టం చేయాలి.. లేదంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే..!

Gudivada Amarnath

Gudivada Amarnath

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకరేపుతోంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పర్యటిస్తున్న సింగరేణి డైరెక్టర్ల బృందం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్టీల్‌ ప్లాంట్‌లో పర్యటిస్తున్నారు.. ఈవోఐ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సాధ్యసాధ్యలపై అధ్యయనం చేస్తున్నారు అధికారులు.. మరో రెండు రోజుల పాటు విశాఖలో సింగరేణి అధికారుల బృందం పర్యటించనుంది.. అయితే, ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం సీరియస్‌గానే స్పందిస్తోంది.. ఎన్టీవీతో మాట్లాడిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. బిడ్‌లో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్టే అంటున్నారు.

ఇక, రాజకీయ కారణాలతోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని తెలిపారు మంత్రి అమర్నాథ్.. బీఆర్‌ఎస్‌కు, బీజేపీతో ఉన్న రాజకీయ విబేధాలకు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారని ఆరోపించారు. అసలు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ, బిడ్ లో పాల్గొంటే మాత్రం ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే అంటున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూనే బిడ్ లో పాల్గొంటాం అంటే అర్థం ఏంటి? అని నిలదీశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అయితే మాతో పాటు కలిసి వస్తే ఆహ్వానిస్తామన్న ఆయన.. ప్రజల సెంటిమెంటును గౌరవిస్తారా? లేదా? చెప్పాలి అని డిమాండ్‌ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతందని స్పష్టం చేశారు.. ప్రజల సెంటిమెంటును గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటాయన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

అసలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనే అర్హత లేదన్నారు మంత్రి అమర్నాథ్.. కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ శాఖ గత ఏడాది ఈ నిబంధనను వెల్లడించిందన్న ఆయన.. ఈ నిబంధన ఉంటే తెలంగాణ ప్రభుత్వం కానీ, సింగరేణి సంస్థ కానీ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఎలా బిడ్‌లో పాల్గొంటుంది? అని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. మొత్తంగా స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో కాకరేపుతోంది. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..