ఒకేరోజు 3000కోట్లు రైతులకు బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వమని వెల్లడించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఇవాళ ఆయన ధాన్యం సేకరణ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. 64.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు, 11 లక్షల మంది రైతుల నుండి 13,264 కోట్ల విలువ గల పంట కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ రైతుబంధు, 24గంటల ఉచిత కరెంటు, సమృద్దిగా నీళ్లు, చెంతనే కొనుగోళ్లు వంటి రైతు అనుకూల విధానాలతో మండే ఎండల్లో పసిడి పంటలు పండుతున్నాయన్నారు. యాసంగి ధాన్యం సేకరణలో దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ అని ఆయన అన్నారు.
Also Read : Viral News: ఇదేం ఆచారం రా నాయనా.. యువకులకు పెళ్లి కావాలంటే అది చెయ్యాలట…
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ యాసంగిలో రైతాంగానికి సంపూర్ణంగా అండగా ఉండి, పకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి ధాన్యం సేకరణ చేశామని ఆయన తెలిపారు. ఇవాళ ఒక్కరోజే రైతుల ఖాతాల్లోకి రూ. 3,000 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తాన్ని సైతం ఈ నెల 20లోపు రైతులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాల వంటి విపత్కర పరిస్థితులను ముందుగా అంచనా వేసి పది రోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7,034 కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతు చెంతకే వెల్లి ధాన్యం సేకరణ చేశామని తెలిపారు. ఇప్పటికే 90 శాతానికి పైగా సేకరణ పూర్తై 6143 కేంద్రాలను మూసివేసినట్లు పేర్కొన్నారు. 18 జిల్లాల్లో సంపూర్ణంగా సేకరణ పూర్తయిందని మిగతా జిల్లాల్లోనూ ఆదివారం వరకూ పూర్తి చేస్తామన్నారు.
Also Read : Andhrapradesh: ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు