AP Elections 2024: నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో యువత కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇక, మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. యువతకు పెద్దపీట వేసేందుకే మన పార్టీ స్థాపించబడిందన్నారు. మహిళలు ఆడ పిల్లలు స్వేచ్ఛగా జీవించేందు కోసం దిశ యాప్ తీసుకువచ్చామన్నారు. యువత ఉపాధి కోసం 20 కోట్లతో ఐడిటిఆర్ ప్రాజెక్టును నిర్మించాం.. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు అని తేడా లేకుండా అమ్మ ఒడిని అందించామని ఆయన చెప్పుకొచ్చారు. నియోజకవర్గం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే యువత భాగస్వామ్యంతోనే సాధ్యం.. మేము రాజకీయాల్లో ఉండి ఏ అభివృద్ధి చేసినా మీకోసమే.. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏమి చేసినా మీ అభివృద్ధి కోసమే అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
Read Also: Kakarla Suresh: ప్రతి టీడీపీ కార్యకర్తను కాపాడుకుంటా, వారికి అండగా ఉంటా..!
మీరు రాజకీయాల్లో బచ్చా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. డోన్ అడ్డా అని మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడికి డోన్ లో సొంత ఇల్లు లేదు, సొంత పార్టీ కార్యాలయం లేదు ఎందుకు? అని ప్రశ్నించారు. మీ రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి చేయని మీ రాజకీయం అనుభవం దేనికి.. మీ రాజకీయ అనుభవం ఎంత.. మీరు చేసిన అభివృద్ధి ఎంత? చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రులు, ఉపముఖ్యమంత్రులు హోదాలు అనుభవించి మీ సొంత ఊర్లకు రోడ్లు వేయలేని మీరా అభివృద్ధి గురించి మాట్లాడేది అని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని సినిమా డైలాగ్ కొట్టి యువతను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్సాహపరిచారు. ఇక, టీడీపీ పిల్లల శిక్షణ కార్యక్రమాల పేరుతో 270 కోట్ల రూపాయలను దోచుకుంది.. అభివృద్ధిని చూసి ఓటెయ్యండి.. అభివృద్ధి చేసిన నాయకుని ఎన్నుకోండి.. అని యువతకు ఆర్థిక మంత్రి బుగ్గన పిలుపునిచ్చారు.