Site icon NTV Telugu

Pulivendula ZPTC Election Result: పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది.. ఇది జగన్ అహంకారానికి చెంపదెబ్బ..!

Anagani Satya Prasad

Anagani Satya Prasad

Pulivendula ZPTC Election Result: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒకే ఒక ఉప ఎన్నిక పులివెందుల కోటను బద్ధలు కొట్టింది.. దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసింది. పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరింది అని వ్యాఖ్యానించారు.. సొంత ఇలాకాలో వైసీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకో లేకపోయారంటే.. పులివెందుల ప్రజలు జగన్ రెడ్డిపై ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోందన్నారు.. ఇది వైసీపీ ఓటమి కాదు.. జగన్ అహంకారానికి చెంపదెబ్బ.. అవినీతికి, అణచివేతకు, అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని వ్యాఖ్యానించారు..

Read Also: Pregnant Woman in Dolly: ప్రసవానికి ఎన్ని కష్టాలు..! వర్షంలో కిలోమీటర్ నడక, 4 కిలో మీటర్లు డోలీలో..

మూడున్నర దశాబ్దాల తర్వాత భయం లేకుండా ఓటేసిన పులివెందుల ప్రజలదే ఈ గెలుపు అని అభివర్ణించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో టీడీపీ సాధించిన ఘన విజయం ఏడాది పాలనకు ఇది రెఫరెండమని పేర్కొన్న ఆయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకానికి, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనం అన్నారు.. ఈవీఎంలతో మాయ జరుగుతుందంటూ అక్కసు వెళ్లగక్కుతున్న జగన్… బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ప్రజాస్వామ్య విజయానికి ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు.. ఇప్పటికైనా అర్థమైందా రాజా.. పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారో..? నీ అరాచక నాయకత్వానికి ప్రజలు గుడ్‌బై చెప్పారు.. బైబై జగన్..! అని కామెంట్ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్..

Exit mobile version