Site icon NTV Telugu

Ambati Rambabu: చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరంకు తీవ్ర నష్టం చేకూరింది..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: పోలవరం విషయమై చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర నష్టం చేకూరిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడం వల్ల రూ. 2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు. 2013-14 రేట్లతో పోలవరం పూర్తి చేస్తామని.. 2016లో చంద్రబాబు అంగీకరించి సంతకం చేశారని.. రూ. 1200 కోట్ల మేర నిధులు మినహా మొత్తం డబ్బులు తీసేసుకున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కృషి వల్ల కేంద్రం మొదటి దశ పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించిందని ఈ సందర్భంగా చెప్పారు. రూ. 12,911 కోట్లు మొదటి విడత ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని.. 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 20,946 పీడీఎఫ్‌లు ఉన్నాయన్నారు. లైడర్ సర్వే ప్రకారం అదనంగా 16,640 పీడీఎఫ్‌లు పెరిగాయన్నారు. వీటి కోసం అదనంగా రూ. 5 వేల కోట్లు అవసరం అవుతాయని కేంద్రానికి పంపామని మంత్రి తెలిపారు.

Also Read: Harish Rao: తెలంగాణ హెల్త్ హబ్‌గా.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగాయి

మంత్రులను చంద్రబాబు విమర్శిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం, చంద్రగిరిని చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కుప్పంను అభివృద్ధి చేయలేని చంద్రబాబుకు మమ్మల్ని విమర్శించే హక్కు ఉందా అంటూ మంత్రి ప్రశ్నించారు. పులివెందులను అభివృద్ధి చేసిన వైఎస్సార్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. మమ్మల్ని ఓ మాట అంటే వంద మాటలు అంటాం అని మంత్రి మండిపడ్డారు. పవన్ ఆరోపణలు చేస్తే బీజేపీ చేసినట్లేనని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బీజేపీ-జనసేన అలయెన్స్‌లో ఉన్నాయి కాబట్టి జనసేన చేసిన ఆరోపణలు బీజేపీ చేసినట్లేనన్నారు.

Also Read: BL Verma: అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్‌ సర్కారు రావాల్సిందే..

బురద జల్లి బీజేపీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ దగ్గర ఆధారాలు ఉంటే పేపర్ స్టేట్మెంట్ ఎందుకు.. నిరూపించాలన్నారు. సోము వీర్రాజు రోజూ చేస్తున్న ఆరోపణలే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లు చేస్తున్నారు.. కొత్తేం ఉందన్నారు. తన మీద పోటీకి టీడీపీ వస్తాదులను తెస్తోందని.. తనను ఓడించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. అన్ని పార్టీలు మారిన వ్యక్తిని నాపై పోటీకి నిలబెడుతున్నారన్నారు. నేను పార్టీలు మారి టిక్కెట్లు తెచ్చుకోను.. జగన్‌పై విశ్వాసంతో నేను సత్తెనపల్లి టిక్కెట్ తెచ్చుకుంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

Exit mobile version