Duddilla Sridhar Babu: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మినీ ఇండస్ట్రీయల్ పార్కులను అభివృద్ధి చేసి, మహిళా పారిశ్రామికవేత్తలకు పురిగొల్పే విధంగా చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎఫ్‌టీసీసీఐ భవనంలో శుక్రవారం జరిగిన “MSME 2024: A Token of Gratitude to Government of Telangana” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్వహించారు.
ఈ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10% ప్రత్యేకంగా కేటాయించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధే సమాజ ప్రగతికి మార్గం చూపుతుందని పేర్కొన్నారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో దళితులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అది మాత్రమే వారిని నిజంగా ఆదుకునే పార్టీ అని తెలిపారు. 2017 నుంచి పారిశ్రామికవేత్తలకు అందాల్సిన సబ్సిడీల బకాయిలు దాదాపు రూ. 4,500 కోట్లుగా ఉన్నాయని, ఇందులో రూ. 2,200 కోట్లను ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే చెల్లించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించామని, మార్చి చివరి నాటికి రూ. 300 కోట్ల చెల్లింపును పూర్తిచేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేసుకుంటూనే సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి నిలిపామని తెలిపారు.
దేశంలో అధిక సంఖ్యలో కార్మికులు ఎంఎస్ఎంఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నా, ఇప్పటి వరకు ఈ రంగానికి ప్రత్యేకంగా పాలసీ లేదు. అయితే, రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా పాలసీని రూపొందించిందని మంత్రి తెలిపారు. పరిశ్రమల స్థాపనలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎంఎస్ఎంఈల పట్ల ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ తొలి వారంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, అధికారులు కలిసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. అక్కడి ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, విధానాలను పరిశీలించి, వాటిని తెలంగాణ రాష్ట్రానికి అనుసంధానించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, కడియం శ్రీహరి, రాంచందర్ నాయక్, మందుల సామెల్, వెడ్మ భోజ్జు, నాగరాజు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. దళిత పారిశ్రామికవేత్తల ఎదుగుదలే సమాజ అభివృద్ధికి దారి చూపుతుందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy : కిషన్ రెడ్డి సైందవ పాత్ర పోషిస్తున్నాడు