భారతదేశంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల హవా నడవనుంది. అయితే ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతదేశంలో ప్రస్తుతం లేని ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. క్రమంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. ఇందుకోసం పలువురు ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ‘ఎంజీ మోటార్’.. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌లో టాప్ కంపెనీ అయిన చార్జ్‌జోన్‌తో జతకట్టింది. ఈ రెండు కంపెనీలు కలిసి భారతదేశంలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నాయి.
రాబోయే నెలల్లో ఎంజీ మోటార్, చార్జ్‌జోన్ కంపెనీలు సంయుక్తంగా హైవేలు, పట్టణాలు మరియు కీలక ప్రదేశాలలో ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లను అందరూ ఉపయోగించుకోవచ్చు. అయితే ఎంజీ కస్టమర్‌లు మాత్రం కొన్ని ఆఫర్‌లను పొందుతారు. ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ… ‘ఈ భాగస్వామ్యం ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి.. అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడంపై మా దృష్టిని కూడా ప్రతిబింబిస్తుంది’ అని అన్నారు.
Also Read: Ishan Kishan-Suryakumar: అతడిని టార్గెట్ చేయని సూర్యకుమార్ చెప్పాడు: ఇషాన్
చార్జ్‌జోన్ సీఈఓ కార్తికేయ హరియాని మాట్లాడుతూ… ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో హై-స్పీడ్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అవసరం ఉంది. మా భాగస్వామ్యం దానిని అందిస్తుందని ఆశిస్తున్నాం’ అని చెప్పారు. ఇప్పటివరకు కార్ల తయారీదారులు 12,000 కంటే ఎక్కువ ఛార్జర్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ కార్లకు (జెడ్ఎస్ ఈవీ మరియు కామెట్ ఈవీ) నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. కామెట్ సిటీ డ్రైవింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది.