సీఎం చంద్రబాబుతో రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగింసింది. రెండు రోజుల్లో వివిధ అంశాలపై కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ముగింపు ఉపన్యాసంలో పీపీపీ వైద్య కళాశాలల సహా వివిధ అంశాలను ప్రస్తావించారు. దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తీసుకురాగలిగాం అని, రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులకు రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో యూనిట్‌కు రూ.1.20 మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పీపీపీ మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు ముందుకు వస్తే, అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతామని వైసీపీ వాళ్లు బెదిరిస్తున్నారు.. ఇలాంటి కామెంట్లు చేయడం వారి రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట అని విమర్శించారు. పీపీపీతో అభివృద్ధి జరుగుతుందని, పీపీపీ పద్దతిన ప్రాజెక్టులు చేపట్టినా అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుందని, నిబంధనలు ప్రభుత్వమే చేస్తుందని సీఎం చెప్పుకొచ్చారు.
‘ప్రైవేటు వారు నిర్వాహకులు మాత్రమే. సీట్లు పెరుగుతాయి, ఫీజు ఏమాత్రం పెరగదు. 70 శాతం ఎన్టీఆర్ వైద్యసేవ ప్రకారమే పేషెంట్లకు ఉచిత చికిత్స జరుగుతుంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు రెండేళ్లలోనే సిద్ధం అవుతాయి. రాజకీయంగా విమర్శలు చేయొచ్చు కానీ, రౌడీయిజం చేస్తామంటే కంట్రోల్ చేస్తాం. పీపీఏల రద్దుతో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు. విద్యుత్ సంస్థల్లో రూ.1,14,352 కోట్ల అప్పులు పేరుకుపోయాయి. రూ.32,166 కోట్ల టారిఫ్ భారాన్ని ప్రజలపై వేశారు. రూ.81 వేల కోట్ల అప్పులు కూడా తీసుకువచ్చారు. రూ.1,25,633 కోట్ల మేర భారం డిస్కంలు, ట్రాన్స్ కోలపై పడింది. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.11,320 కోట్ల మేర భారం తగ్గించా. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించాం, ప్రజలపై భారం మోపబోవటం లేదు. రుణ నిర్వహాణ కూడా సమర్ధంగా చేస్తున్నాం. గత పాలకులు 13 శాతం వరకూ వడ్డీలకు అప్పులు తెచ్చారు. ఇప్పుడు ఆ రుణాలను రీషెడ్యూలింగ్ చేస్తున్నాం. గత 18 నెలల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలిగాం, నేరాల రేటును కూడా తగ్గించాం. నాటు సారా తయారీని నియంత్రించడానికి మార్పు అనే ప్రాజెక్టును తీసుకువచ్చారు, అది రోల్ మోడల్. సారా తయారీ దారులకు కూడా రీహాబిలిటేషన్ కల్పిస్తున్నారు.. ఉపాధి చూపుతున్నారు’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Also Read: Pawan Kalyan: ఎవరినీ వదలొద్దు.. కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్!
‘తిరుమల ప్రసాదంలో మళ్లీ నాణ్యత తీసుకువచ్చాం. అన్నా క్యాంటీన్లు, పెన్షన్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. 18 నెలల్లో రాష్ట్రం రికవరీ అవుతుందని, రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుందని నేను కూడా ఊహించలేదు. కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాల్లో జరిగే నేరాలపై కఠినంగా వ్యవహరించాలి. వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే సహించవద్దు. వ్యక్తిగతంగా ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవద్దు. జనవరి 15 నుంచి అన్ని శాఖల ఫైల్స్, ప్రభుత్వ సేవలన్నీ ఆన్ లైన్లో ఉండాలి. అప్పుడే ప్రజలు సంతృప్తి చెందుతారు. నిన్నటి వరకూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అత్యుత్తమ ఫలితాలు రాబట్టాం. పరిశ్రమలకు ప్రోత్సాహకం కోసం ఎస్క్రో ఖాతా విధానం తీసుకువచ్చాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు విధానాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నాం. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడాలి. నేరాల దర్యాప్తులోనూ వేగం పెంచండి. వచ్చే కలెక్టర్లు, ఎస్పీల సమావేశానికి మరింతగా మార్పు రావాలి. ఇప్పటి వరకూ జరిగిన సమావేశాలన్నింటికంటే.. 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశం చక్కగా జరిగింది’ అని సీఎం అన్నారు.