NTV Telugu Site icon

Ts Police: త్వరలో తెలంగాణలో భారీగా పోలీసుల బదిలీలు!

Ts Police

Ts Police

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీస్థాయిలో పోలీసుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని, సొంత ప్రాంతాలకు ఎవరినీ బదిలీ చేయవద్దని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఎన్నికల కమిషన్‌ నిబంధనల పరిధిలోకి వచ్చేవారందరి లిస్ట్ ను రెడీ చేస్తున్నారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 25వ తేదీన రాష్ట్రంలో భారీస్థాయిలో ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒకేసారి 91 మందిని బదిలీ చేశారు.

Read Also : East Godavari Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

అంతకుముందు కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీలు జరగలేదు. దాంతో సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులందర్నీ మార్చారు. కిందిస్థాయిలో సిబ్బంది బదిలీలు అవసరాన్ని బట్టి చేస్తున్నారు. కాగా రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసుశాఖలో భారీస్థాయిలో బదిలీలు చేపట్టనున్నారు. కొన్ని జిల్లాల ఎస్పీలను కూడా మార్చే ఛాన్స్ ఉంది. నిజామాబాద్‌ కమిషనర్‌ నాగరాజు గత మార్చిలో పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. నిర్మల్‌ ఎస్పీ ప్రవీణ్‌కే ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దాంతో పాటు హైదరాబాద్‌, రాచకొండ షీ టీమ్స్‌ డీసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Read Also : RBI: మీకు హోంలోన్ ఉందా.. ఇంటిపత్రాలు పెట్టారా.. బ్యాంకు మీ పత్రాలు పోగొట్టిందా.. అయితే శుభవార్త

పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ విభాగానికి మూడో డీసీపీ పోస్టును కేటాయించారు. ఆ స్థానాన్ని ఇంకా పోలీస్ శాఖ భర్తీ చేయలేదు. ఇవన్నీ తాజా బదిలీల్లో భర్తీచేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే క్షేత్రస్థాయిలో మూడేళ్లకు మించి పనిచేస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ట్రాన్స్ ఫర్ చేయడంతో పాటు సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని మార్చనున్నారు. దీనికి సంబంధించి బదిలీల ప్రక్రియ ఇప్పటికే కసరత్తు మొదలైంది.

Read Also : Inter Supplementary Exam: నేటి నుంచే తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

మూడేళ్ల నిబంధన శాంతిభద్రతల విభాగానికి వర్తిస్తుంది. స్పెషల్‌బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ వంటి విభాగాలకు దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని శాంతిభద్రతల విభాగంలో మూడేళ్లకు మించి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న కొందరు మళ్లీ అదే ప్రాంతాల్లో కొనసాగడానికి గాను.. స్పెషల్‌బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ వంటి విభాగాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Show comments