శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. అయితే ప్రస్తుతం ఇది ట్రయల్ రన్‌లో ఉంది. ట్రయల్ రన్‌లో భాగంగా సోమవారం 5 వేల మసాలా వడలను టీటీడీ సిబ్బంది భక్తులకు వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తి స్థాయిలో అమలు చేస్తారని తెలుస్తోంది.
శ్రీవారి భక్తులకు కొన్నేళ్లుగా అన్నంతో పాటు కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, కొబ్బరి చట్నీ, చక్కెర పొంగలి వడ్డిస్తున్నారు. అన్నదానం మెనూలో మరో పదార్థం చేర్చాలని 2024 నవంబరు 18న టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం ప్రయోగాత్మకంగా ఉల్లి, వెల్లుల్లి లేకుండా 5 వేల వడలను భక్తులకు వడ్డించారు. టీటీడీ ఛైర్మన్ చేతుల మీదుగా మెనూలో మసాలా వడలు చేర్చే కార్యక్రమం ప్రారంభించారు. అన్నప్రసాదాల నాణ్యత, వడ అందించడంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.