భారతదేశ శాశ్వత సంస్కృతి, ఆధ్యాత్మికత, విశ్వాసానికి ప్రతీక అయిన మహా కుంభమేళా సంగం నగరం ప్రయాగ్‌రాజ్‌లో నేటి నుంచి ప్రారంభమైంది. ఈరోజు పౌష్ పూర్ణిమ అమృత స్నానం. గంగా, యమున, సరస్వతి (అదృశ్య) నదుల సంగమంలో ఉదయం నుంచి భక్తులు స్నానాలు చేస్తున్నారు. ఈరోజు దాదాపు కోటి మంది భక్తులు గంగాస్నానం చేస్తారని చెబుతున్నారు. కాగా.. ఈ కుంభమేళాలో పలువురు బాబాలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం..
రాధే పూరీ బాబా..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జెయిన్‌కి చెందిన రాధే పూరి బాబా.. ఆయన తపస్సును చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ బాబా గత 15 ఏళ్ల నుంచి తన చెయ్యి పైకి గాల్లో ఉంచారు. బాబా తపస్సు కారణంగా ఆయన చెయ్యి పని చేయకుండా అయిపోయింది. ఇప్పటికీ ఆ చేయి కిందికి పెట్టుకోవడానికి రావడం లేదు. ఆయన చేతి వేళ్లు ఒక దానితో ఒకటి దగ్గరకు ముడుచుకున్నాయి. గోర్లు కూడా తీసుకోకపోవడంతో అవి రింగులు తిరిగాయి. ఇది ఒక కఠోర తపస్సుగా చెప్పుకోవచ్చు. విశ్వకల్యాణం కోసం ఈ తపస్సు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జీవితాంతం ఈ చెయ్యి ఇలాగే ఉంటుంది.
చోటూ బాబా..
అతనే చోటూ బాబా.. అస్సాంలోని కామాఖ్య పీఠ్‌కు చెందిన 57 ఏళ్ల సన్యాసి ఛోటూ బాబా యాత్రికుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ చోటూ బాబా గత మూడు దశాబ్దాలుగా స్నానం చేయలేదు. ఈ బాబా కేవలం 3 అడుగుల 8 అంగుళాల ఎత్తుఉంటారు. గంగాపురి మహారాజ్ అని కూడా పిలువబడే ఛోటూ బాబా.. మహా కుంభ ఉత్సవానికి హాజరయ్యే భక్తులను, సందర్శకులను ఆకర్షిస్తున్నారు. ఈ చోటూ బాబా గత 32 సంవత్సరాలుగా స్నానానికి దూరంగా ఉన్నారు. అసాధారణ ప్రతిజ్ఞ చేసి నెరవేరని కోరికతో ఇలా స్నానం చేయకుండా ఉండిపోయారు. అయితే చోటూ బాబా ఆధ్యాత్మిక నిబద్ధత చాలా మందిని ఆకట్టుకుంటుంది. కుంభమేళాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
అనాజ్‌వాలీ బాబా..
బాబా అమర్జీత్ ‘అనాజ్‌వాలీ బాబా’గా పేరొందారు. ఈయనను చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన బాబా అమర్జీత్ బాబా తన తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు లాంటి పంటలను పండిస్తూ, అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు.
తాళాల బాబా..
మరొకరు హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా. చాబీవాలే బాబా(తాళాల బాబా) అని పిలుస్తుంటారు. ఈ బాబా ఎప్పుడూ తన వెంట 20 కిలోల తాళం చెవులను మోసుకెళుతుంటారు. ఈయనను ప్రయాగ్‌రాజ్‌లోని వారు బహువింతగా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా తన 16 ఏళ్ల వయసులోనే తన ఇంటిని విడిచిపెట్టి, ఆధ్యాత్మిక చింతనా మార్గాన్ని అవలంబించారు. ‘నా తల్లిదండ్రులు సన్యాసమార్గం అవలంబించారు. వారు నాకు హరిశ్చంద్ర అని పేరు పెట్టాడు. ఆ పేరును నిలబెట్టుకునేందుకు నేను నా ఆధ్యాత్మిక జీవన ప్రయాణం ప్రారంభించాను. హరిశ్చంద్రుడు మనందరికీ సన్మార్గాన్ని చూపాడు. నేను హరిశ్చంద్రుడు అందించిన మార్గాన్ని అనుసరిస్తున్నాను. ఇందుకోసం చిన్నతనంలోనే ఇంటిని విడిచిపెట్టాను. సత్యమార్గాన్ని అనుసరించడం ద్వారా జీవితంలో ముక్తిని పొందేందుకు ప్రయత్నిస్తున్నాను.” అని తాళాల బాబా పేర్కొన్నారు.
రుద్రాక్ష్ బాబా..
మహాకుంభ మేళాకు రుద్రాక్షల బాబా కూడా చేరుకున్నారు. ఈయన 108 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఆ మాలల్లో దాదాపు 11వేల రుద్రాక్షలు ఉన్నాయి. వాటన్నింటి బరువు దాదాపు 30 కిలోలు ఉంటుందని తెలిపారు.