Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా సర్వర్లు మొరాయించాయి.. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల కోసం తరలిరావడంతో.. సర్వర్లు బిజీగా మారి మొరాయించినట్టు చెబుతున్నారు.. ఈ ఎఫెక్ట్‌తో రెండు రోజులుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి.. దీంతో, రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర రద్దీ పెరుగుతోంది.. ఇదే, సమయంలో, సర్వర్లు మొరాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆఫీసుల దగ్గర ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దీంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి మ్యానువల్‌గా రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొంది.. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం.. సర్వర్లలో సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో మ్యానువల్‌గానే రిజిస్ట్రేషన్లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి.
Read Also: Delhi: ఢిల్లీకి “ఎల్లో అలర్ట్”.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, ఈదురు గాలులు
అయితే, జూన్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్న నేపథ్యంలో.. ఉద్దేశ్యపూర్వకంగానే రిజిస్ట్రేషన్లు చేయడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు సాధారణ ప్రజలు.. గంటల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చిందని.. అయినా.. రిజిస్ట్రేషన్లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలా ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపడం సరికాదని అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దని, నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. కాగా, జూన్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. చలానాల ధర పెరగడంతో తమపై అధిక భారం పడుతుందని భావించి జనం భూముల క్రయ విక్రయాలు త్వరగా చేసుకోవాలని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టడంతోనే సాంకేతిక సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు..