Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఆదివారం అరెస్టు చేసింది. డిప్యూటీ సీఎం ప్రస్తుతానికి సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే ఉంటారు. దేశ రాజధానికి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు, అవినీతికి సంబంధించి సీబీఐ ఆదివారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఎనిమిది గంటల పాటు విచారణ అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతను అరెస్టు చేశారు. సిసోడియాను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరనుంది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని సిసోడియాపై ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Sidhu Moose Wala: పంజాబ్ జైలులో ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హత్యకేసు నిందితులు హతం
ఆప్ సర్కారు తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ను జూలై 31, 2022న రద్దు చేయబడినప్పటి నుండి చాలా మంది సీనియర్ ఆప్ నాయకులు, వారి సన్నిహితులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. కొత్త విధానాన్ని రద్దు చేసిన తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 17, 2020కి ముందు అమల్లో ఉన్న ‘పాత ఎక్సైజ్ విధానాన్ని’ తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది. ఆప్ చర్యను అనుసరించి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎక్సైజ్ పాలసీ అమలులో నిబంధనల ఉల్లంఘనలు, విధానపరమైన లోపాలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. సీబీఐ నిందితుడిగా పేర్కొనని డిప్యూటీ సీఎం ఇంటితోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుచోట్ల సోదాలు నిర్వహించాయి. ఆరోపించిన కుంభకోణంపై ఆప్, బీజేపీల మధ్య వాగ్వాదాలు కూడా నెలకొన్నాయి.