Heavy Fuel Leak from Manipur’s Leimakhong Power Station: ఇప్పటికే జాతి హింసతో అట్టుడుకుతోన్న మణిపుర్‌ను మరో ఘటన భయభ్రాంతులకు గురిచేసింది. మణిపుర్‌లోని ఓ పవర్ స్టేషన్ నుంచి భారీగా ఇంధనం లీక్ అయ్యింది. కాంగ్‌పోక్పి జిల్లాలోని లీమాఖోంగ్ పవర్ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది. పవర్ స్టేషన్ నుంచి భారీగా ఇంధనం వెలుపలికి రావడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇంధనం నదుల్లోకి చేరకుండా.. వెంటనే చర్యలు తీసుకోవాలని మణిపూర్ ప్రభుత్వం అన్ని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.
పవర్ స్టేషన్ నుంచి లీక్ అయిన ఇంధనం ఇప్పటికే పలు ప్రాంతాల్లో సెలయేర్లలో పారింది. అక్కడక్కడ మంటలు కూడా చెలరేగాయి. ఇంధన ప్రవాహం ఖుర్ఖుల్-లోయిటాంగ్-కమెంగ్-ఇరోయిసెంబా-నంబుల్ ద్వారా చివరకు దిగువ ఇంఫాల్ నదిలో కలవనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంధన ప్రవాహంను కట్టడి చేయాలని సంబంధిత శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుని.. ఈ పర్యావరణ విపత్తును నివారించడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Also Read: RAM Trailer: ఏంట్రా ఒక్కదానికేనా.. రేపు పెళ్లయ్యాక ఏం చేస్తావ్! ఆకట్టుకుంటున్న రామ్ ట్రైలర్
రెస్పాన్స్ మెకానిజమ్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లను వెంటనే యాక్టివేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంధన ప్రవాహంను కట్టడి చేయడానికి సిబ్బంది, యంత్రాలు ప్రయత్నిస్తున్నాయి. మణిపూర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ మంత్రి లీషాంగ్‌థెమ్ సుసింద్రో మైతేయ్, అటవీ శాఖ మంత్రి తొంగమ్ బిశ్వజిత్ సింగ్ గత రాత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. జాతుల మధ్య వైరమే ఈ ఇంధన లీక్‌కు కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. గత ఏడాది మే 3న మెయిటీ, కుకీ కమ్యూనిటీల మధ్య జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్‌లో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా బిష్ణుపుర్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు కనిపించకుండా పోయారు.