Manchu Manoj: మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణుతో పాటు మరో ఆరుగురిపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. విష్ణు అనుచరులు వినయ్ మహేశ్వరి, విజయ్ రెడ్డి, కిరణ్, రాజ్ కొండూరు, శివ, వన్నూరులపై కూడా ఫిర్యాదు చేశాడు. ఏడు అంశాలపై విష్ణుపై ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు పంపించాడు. మంచు మనోజ్ ఫిర్యాదు కాపీలోని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మంచు విష్ణుతో పాటు.. తన అనుచరుల నుంచి నాకు, నా భార్యకు, నా పిల్లలకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నాడు. నా కుటుంబంపై కుట్రలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశాడు.
Read Also: Manchu Family: మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ
మోహన్ బాబు విశ్వవిద్యాలయం, ట్రస్ట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని.. దీన్ని బయట పెట్టినందుకు తనపై కుట్రలు పన్నారని మనోజ్ ఫిర్యాదులో తెలిపాడు. తనను చంపుతానని బెదిరించారని.. తల్లిదండ్రులు లేని తన భార్యను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గపు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నాడు. “నన్ను, నా భార్య, నా పిల్లల పై దాడికి ప్రయత్నించారు.. అప్పుడే నేను 100కి కాల్ చేసాను. కిరణ్, విజయ్ రెడ్డి మా ఇంట్లోకి అక్రమంగా చొరబడి నాపై దాడి చేసిన సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ దొంగిలించారు. నాపై దాడి జరిగిన సాక్ష్యాలు లేకుండా చేసారు.. దాడి జరిగినప్పటికీ, నా కుటుంబ సభ్యులపై నేను ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. నా భార్యను గొడవల్లోకి లాగారు.. మా నాన్న చేసిన చర్యలతో నేను తీవ్రంగా బాధపడ్డాను. నా ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపి వేయమని నేను రాసినట్టు ఫేక్ లెటర్ విద్యుత్ శాఖకి పంపారు. నా ఇంటికి నీటి సరఫరా నిలిపివేశారు. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా మానసికంగా హింసిస్తున్నారు. నాకు, నా కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి. నాకు, నా కుటుంబానికి ప్రాణ హాని ఉంది.” అని మంచు మనోజ్ పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.