మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్‌లో విషాదం నెలకొంది. రోజుల వ్యవధిలో ఒకే కుటంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య యత్నంకు పాల్పడగా.. ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడి మృతిని తట్టుకోలేని దంపతులు కూతురుకు పురుగుల మందు తాగించి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనతో రాజీవ్ నగర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
రాజీవ్ నగర్‌కు చెందిన భార్య-భర్తలు బండి చక్రవర్తి, దివ్యకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. రెండు నెలల క్రితం కుమారుడు పవన్ తీవ్ర జ్వరంతో ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో చక్రవర్తి, దివ్యలు మనస్థాపం చెందారు. అప్పటినుంచి ఇద్దరు కుమారుడిని తలుచుకుంటూ ఏడ్చేవారు. కుమారుడు మృతి చెందాడని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6వ తేదీన కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలుపుకొని తాగారు. ముందుగా కూతురు దీక్షిత (10)కు కూల్ డ్రింక్ ఇచ్చి.. ఆపై చక్రవర్తి, దివ్యలు కూడా తాగారు.
ఇది గమనించిన చుట్టుపక్కల వారు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్టోబర్ 8 తేదీన దీక్షిత చనిపోయింది. అక్టోబర్ 10వ తేదీన దివ్య చనిపోగా.. అక్టోబర్ 15న చక్రవర్తి మృతి చెందాడు. కొద్ది రోజుల వ్యవధిలోనే నలుగురు మృతి చెందడంతో రాజీవ్ నగర్‌లో విషాదం నెలకొంది. నలుగురు చనిపోవడంతో చక్రవర్తి కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.