Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?

Manav Suthar

Manav Suthar

Manav Suthar: భారత క్రికెట్‌లో మరో యువ కెరటం మెరిసింది. ముల్లాంపూర్‌ వేదికగా శనివారం (జూన్ 6) నుంచి ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్‌లో యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ మ్యాచ్ కోసం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదేనని చెప్పాలి. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన డెబ్యూ క్యాప్‌ను అందుకున్న 23 ఏళ్ల మానవ్ సుతార్, భారతదేశం తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 319వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు సైతం తమ మిస్టరీ స్పిన్నర్ నంగేయాలియా ఖరోటీని ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి పరిచయం చేసింది.

రాజస్థాన్‌కు చెందిన మానవ్ సుతార్ కేవలం స్పిన్నర్‌గానే కాకుండా లోయర్ ఆర్డర్‌లో జట్టుకు ఉపయోగపడే చక్కని బ్యాటర్. దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ తరఫున ఆడుతూ అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. 2022-23 రంజీ సీజన్‌లో ఏకంగా 39 వికెట్లు పడగొట్టి తొలిసారి వెలుగులోకి వచ్చిన సుతార్, ఆ తర్వాత 2025-26 సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌ల్లోనే (5 ఇన్నింగ్స్‌లు) 18 వికెట్లతో చెలరేగి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటివరకు ఆడిన 29 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 8/33 అత్యుత్తమ గణాంకాలతో మొత్తంగా 129 వికెట్లు పడగొట్టాడు. అలాగే 25 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు, 29 దేశవాళీ టీ20ల్లో 25 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

×
×
Ad

ఈ అద్భుతమైన డొమెస్టిక్ ట్రాక్ రికార్డే అతనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి మెగా స్టేజ్ పైకి వచ్చేలా చేసింది. 2024 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు అతడిని రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. ఆ సీజన్‌లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన సుతార్ ప్రతిభపై నమ్మకంతో, గుజరాత్ ఫ్రాంచైజీ 2025 సీజన్‌లో అతడిని రూ.30 లక్షలకు తిరిగి కొనుగోలు చేసింది. ఆపై 2026 సీజన్‌కు కూడా అతని బేస్ ప్రైస్‌కే రిటెయిన్ చేసుకుంది. ఇలా 2024 నుండి 2026 వరకు మూడు సీజన్ల వ్యవధిలో మానవ్ సుతార్ ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు తీశాడు.