రోజు రోజుకు లోన్ యాప్స్ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. రుణ యాప్‌ల నుంచి డబ్బులు తీసుకొని చెల్లించినా.. చెల్లించలేదంటూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా.. వారి వ్యక్తిత్వాన్ని సైతం దెబ్బతీసేలా.. ఆ వ్యక్తి బంధువులకు, స్నేహితులకు మెసేజ్‌లు, ఫోన్‌లు చేస్తూ.. తీవ్ర మనోవేధనకు గురి చేస్తున్నారు. దీంతో ఆ లోన్ తీసుకున్న బాధితులు ఆత్మహత్యలకు పాల్పడతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధవళేశ్వరంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శ్రీనివాసరావు లోన్ యాప్ లోన్ తీసుకున్నాడు.
అయితే.. ఆ లోన్ డబ్బులు తిరిగి కట్టేశాడు కూడా. అయినప్పటికీ డబ్బులు కట్టాలని బెదిరించడంతో ఆఫీసులోనే శ్రీనివాసరావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకన్నాడు. ఆఫీసు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీనివాస్. దీంతో.. మృతుడు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు ఏఈ. మృతుడి తండ్రి వెంకట్రావు ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.