NTV Telugu Site icon

Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో గొడవ.. స్నేహితుడి దారుణ హత్య

Liquor

Liquor

Liquor Bottles: దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఈ కేసు వివరాలను తాండూర్‌ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి వెల్లడించారు. గత నెల 31న గోపాల్‌పూర్‌ గ్రామ సమీపంలో గల క్వారీ గుంతలో రుద్రారం గ్రామానికి చెందిన బండమీది రమేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టి స్నేహితులే నిందితులుగా గుర్తించారు. హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన పర్సు ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేసినట్లు తెలిసింది.

Read Also: Wolf Attack : 200 మంది పోలీసులు, 18 మంది షూటర్లు… తోడేళ్ల అంతానికి భారీ ఆపరేషన్

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన నరేష్, సల్బతాపూర్‌ గ్రామానికి చెందిన శ్రీకాంత్, బండమీది రమేష్ ముగ్గురు స్నేహితులు. ముగ్గురు తాండూరులో కలుసుకొని పెద్దేముల్‌లో మద్యం సేవించారు. అనంతరం పెద్దేముల్ తండాలోని కల్లు కాంపౌండ్‌లో 13 లిక్కర్ బాటిళ్లు చోరీ చేశారు. గోపాల్‌పూర్‌ పరిసరాల్లో 3 బాటిళ్లను సేవించి.. మిగతా బాటిళ్లను పంచుకుందామని అనుకున్నారు. రమేష్ తనకు మద్యం ఎక్కువగా తాగే అలవాటు ఉందని.. తనకు ఎక్కువ బాటిళ్లు కావాలని డిమాండ్ చేశాడు. లేకుంటే బాటిళ్లు దొంగతనం విషయం బయటపెడతానని హెచ్చరించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం పెరిగి గొడవ పెద్దదైంది.

మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్, నరేష్‌లు ఇద్దరు కలిసి.. రమేష్‌ను బెల్టుతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న క్వారీ గుంతలో నీటిలో పడేశారు. రమేష్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహం దగ్గర దొరికిన పర్సు ఆధారంగా శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా..అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకడైన శ్రీకాంత్ గతంలో కారు అద్దాలు పగలగొట్టి కెమెరాను దొంగిలించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.

Show comments