Fraud: మూఢనమ్మకాల పేరుతో కొందరు వ్యక్తులు ప్రజలను మోసం చేస్తున్నారు. నేల నుండి నింగికి చేరుకునే సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా.. ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. కళ్లకి ఎదురుగా మూఢనమ్మకాల పేరుతో డబ్బు దోచుకుంటున్న అపరచితులని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. మాయమాటలు చెప్పి భక్తులను ఓ అర్చకుడు మోసం చేశాడు. క్షుద్రపూజల పేరుతో అందినకాడికి నొక్కేశాడు. విశాఖపట్నంలోని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తగరపువలసలో మాయమాటలతో భక్తులకు అర్చకుడు శఠగోపం పెట్టాడు. క్షుద్ర పూజల పేరుతో 48 తులాల బంగారం నొక్కేశాడు ఆ ఘనుడు. ఈ క్షుద్రపూజల వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. గుడికి వచ్చే భక్తుల బలహీనతలు తెలుసుకొని వాటిని ఆసరాగా చేసుకొని వారిని నమ్మించి మోసం చేయడమే ఆ పూజారి పనిగా పెట్టుకున్నట్లు బయటపడింది.
Also Read: Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడే..
అదేవిధంగా ఆ గుడికి వచ్చిన ఒక మహిళకు కూడా కుచ్చుటోపి పెట్టి మోసం చేశాడు. సుమారు 48 తులాల బంగారానికి ఎసరు పెట్టాడు. ఈ వ్యవహారంలో మరొక ఇద్దరు తోడు కావడంతో గుట్టు చప్పుడు కాకుండా బంగారాన్ని తనఖా పెట్టి డబ్బులు పంచేసుకున్నారు. బాధితురాలు బంగారం కోసం అడుగుగా మీనమేషాలు లెక్కించారు. దీంతో సందేహం వచ్చి ఆమె ఇంట్లో వాళ్లకు చెప్పి, స్థానిక భీమిలి పోలీసులకు నిందితులు చేసిన మోసంపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మూఢనమ్మకాలతో మోసాలు చేసే అపరచితులను క్షమించేది లేదని పోలీసులు హెచ్చరించారు.