Site icon NTV Telugu

Mamta Kulkarni: దావూద్‌ ఇబ్రహీం ఉగ్రవాది కాదు.. మాజీ హీరోయిన్, సన్యాసి సంచలన వ్యాఖ్యలు..

Mamta Kulkarni

Mamta Kulkarni

Mamta Kulkarni: బాలీవుడ్‌ మాజీ నటి, ప్రస్తుతం సన్యాసినిగా జీవిస్తున్న మమతా కులకర్ణి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోరఖ్‌పూర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం చెలరేగింది. తన మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో మమతా మాట్లాడుతూ.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లకు పాల్పడలేదని, అతడు ఉగ్రవాది కాదన్నారు. దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన విక్కీ ‌ గోస్వామితో మమతకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విక్కీ డ్రగ్స్‌ వ్యాపారంలో ఈమె భాగస్వామ్యం కూడా ఉన్నట్లు, అతడితో వివాహం జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ అంశంపై సైతం ఆమె స్పందించారు. ఇవన్నీ అసత్య ఆరోపణలని కొట్టి పారేశారు. తనకు రాజకీయాలతో లేదా సినిమా పరిశ్రమతో సంబంధం లేదని.. తాను పూర్తిగా ఆధ్యాత్మికతకు అంకితభావంతో ఉన్నానన్నారు. సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా జాతి వ్యతిరేక శక్తులతో తనకు ఎలాంటి సంబంధం ఉండటం అసాధ్యమని చెప్పారు. అయితే.. దావూద్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలపై మమత మరోసారి స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంటూ వివరణ ఇచ్చారు. “నేను దావూద్ ఇబ్రహీం గురించి కాదు, విక్కీ గోస్వామి గురించి మాట్లాడుతున్నాను. దావూద్ నిజంగా ఉగ్రవాది” అని ఆమె తెలిపారు.

READ MORE: Supreme Court: దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కాగా.. ప్రముఖ హీరోయిన్‌ మమత కులకర్ణి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మహాకుంభమేళాలో సన్యాసం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ మహా మేళాలో మహామండలేశ్వర్‌గా మారుతున్నట్లు ప్రకటించింది. ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించానలుకున్న ఆమె ఫిబ్రవరి వరకు కుంభమేళా ఉంది. జనవరి 24న కిన్నార్‌ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్‌ డాక్టర్‌ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష తీసుకుంది. తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకుంది. కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షతో, భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో ఆమె నిజమైన సాధ్విగా మారిపోయింది. 25 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ఆమె ఇలా సాధ్విగా మారిపోవడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు మమత కులకర్ణి సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగొందింది. కరణ్‌ అర్జున్‌, దిల్‌బర్‌, క్రాంతివీర్‌, సబ్‌సే బడా ఖిలాడి, కిస్మత్‌, నజీబ్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగ పోలీస్‌ చిత్రాల్లో కథానాయికగా యాక్ట్‌ చేసింది.

READ MORE: Venkaiah Naidu: గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని వదులుకున్న త్యాగశీలి పటేల్..

Exit mobile version