ప్రొఫెసర్ హరగోపాల్‌పై ఉపా కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని అంశాలపై అవగాహన ఉండి రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి హరగోపాల్ అని ఆయన అన్నారు. హరగోపాల్ ఒక నిష్పక్షపాత మేధావిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసారన్నారు. తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారితో కలిసి పోరాటాలు చేసిన ఉద్యమ కారుడని, తెలంగాణ సమకాలీన సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేసి ప్రజలకు న్యాయం అయ్యేలా కృషి చేసిన మనిషి హరగోపాల్ అని ఆయన అన్నారు. అలాంటి హరగోపాల్ పైన ఉపా కేసు లు పెట్టి వేధించడం ఈ పాలకుల దుశ్చర్యలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. గతంలో నక్సలైట్లు ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తే ప్రభుత్వం కోరిక మేరకు మధ్యవర్తిత్వం వహించి వారి విడుదలకు సహకరించిన వ్యక్తి హరగోపాల్ అని, అలాంటి వ్యక్తిపైన పోలీసులు పెట్టిన ఉపా కేసులు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యావేత్తలపై అక్రమ కేసులు సరైంది కాదు : ఐజేయూ, టీయూడబ్ల్యూజే
విద్యావేత్తలు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజాషా లతో పాటు ప్రముఖ కళాకారులు, సామాజిక కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ‘ఉపా’ కేసు నమోదు చేయడం తీవ్ర విస్మయం కలిగిస్తుందని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) క్రింద ప్రభుత్వం వారి పేర్లను ఒక కేసులో నమోదు చేసినట్లు తెలుస్తోందని వారు తెలిపారు. ఇదే నిజమైతే కేసు వివరాలను బహిరంగ పర్చాలని వారు డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజాషా లాంటి ప్రముఖులను ఇలాంటి కేసుల్లో ఇరికించడం వెనక లోతైన కుట్ర దాగి ఉంటుందని తాము భావిస్తున్నట్లు వారు చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.