ఓటీటీ ప్రేక్షకులలో మలయాళ సినిమాలపై క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.సరికొత్త కథతో, కథనాలతో మలయాళ మేకర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఒక సూపర్ హిట్ సస్పెన్స్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఆట్టం’. మామూలుగా మలయాళ మేకర్స్ ఎక్కువగా ఫీల్ గుడ్ కథలతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తారు. కానీ ‘ఆట్టం’ అలా కాదు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్.సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లకు భాషతో సంబంధం లేదు. ఏ భాషలో అయినా ఈ జోనర్లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. అలాగే మలయాళంలో కూడా ‘ఆట్టం’ మూవీ చూడాలని చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఆట్టం’ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది.
ఓటీటీలో ఈ సినిమాను చూసినవారు పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ మూవీ కేవలం మలయాళ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆట్టం’ అంటే తెలుగులో నాటకం అని అర్థం. ఈ మూవీని ఆనంద్ ఏకర్షి డైరెక్ట్ చేశాడు. వినయ్ ఫోర్ట్ ఇందులో హీరోగా నటించగా.. జరీన్ షిహాబ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో కళాభవన్ షాజాన్ ముఖ్య పాత్రలో కనిపించారు. వీరితో పాటు అజీ తిరువంకులం, జాలీ ఆంటనీ, మదన్ బాబు, నందన్ ఉన్నీ, ప్రశాంత్ మాధవన్, సనోష్ మురళి మరియు సెల్వరాజ్ రాఘవన్ వంటి తదితరులు కూడా ఈ సినిమాలో నటించారు. జాయ్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్పై డాక్టర్ అజిత్ జాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదల అవ్వకముందే ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రసారం అయ్యి ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.‘ఆట్టం’ మూవీ గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఓపెనింగ్ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపికయ్యింది. దీంతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజెల్స్ లో కూడా ఈ సినిమాకు గ్రాండ్ జ్యూరీ అవార్డ్ దక్కింది.