మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారని మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మీడియాకు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం దట్టమైన అడవిలో కూలిపోయిందని.. ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొన్నారు. ఈ విషాదకర వార్త తెలియజేయడానికి బాధపడుతున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నారు.
ఉపాధ్యక్షుడు చిలిమా(51) సహా మరో తొమ్మిది మంది సైనిక విమానంలో ప్రయాణిస్తుండగా సోమవారం అదృశ్యమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర నగరమైన జుజులో ల్యాండ్ కావడం విఫలమైంది. దీంతో రాజధాని లిలాంగ్వేకి తిరిగి రావాలని సందేశం అందింది. కానీ తిరిగి రాకుండానే దట్టమైన అటవీ ప్రాంతంలో అదృశ్యమైంది. దీంతో అప్పట్నుంచి జల్లెడ పట్టగా.. మంగళవారం దట్టమైన అడవిలో విమానం జాడను కనుగొన్నారు. తిరిగి క్షేమంగా రావాలని అందరూ ప్రార్థించారు. కానీ చివరికి విషాదంగా ప్రయాణం ముగిసింది.
ఇది కూడా చదవండి: India-China: చైనా కవ్వింపులకు భారత్ గట్టి సమాధానం.. టిబెల్‌లోని 30 ప్రదేశాలకు పేర్లు మార్చనున్న భారత్..
చిలిమా ప్రయాణిస్తున్న విమానం జాడ తప్పిపోగానే మలావి పొరుగు దేశాలతో సహా ఇతర దేశాల హెలికాప్టర్లు మరియు డ్రోన్‌లతో సహాయ చర్యలు చేపట్టినట్లు ఆర్మీ కమాండర్ జనరల్ పాల్ వాలెంటినో ఫిరి తెలిపారు. సి-12 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సహా అందుబాటులో ఉన్న అన్ని సహాయాలను అందించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేసినట్లు లిలాంగ్వేలోని యూఎస్ ఎంబసీ తెలిపింది. అయితే సెర్చ్ టీమ్ సభ్యులు షేర్ చేసిన ఫుటేజ్ మంగళవారం నాడు ప్రతికూల వాతావరణం కనబడిందన్నారు. పొగమంచు కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలిగించాయని తెలిపారు.