తెలుగు వారికి అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి. దశాబ్దాలుగా మనం జనవరి 14వ తేదీనే సంక్రాంతి జరుపుకోవడం అలవాటు చేసుకున్నాం. కానీ, గత కొన్ని ఏళ్లుగా సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం మనం గమనిస్తూనే ఉన్నాం. మన దేశంలోని ఇతర పండుగలు చంద్రుడి గమనం (చాంద్రమానం) ప్రకారం మారుతుంటాయి, కానీ సంక్రాంతి మాత్రం సూర్యుని గమనం (సౌరమానం) ఆధారంగా వస్తుంది. మరి ఇలాంటి పండుగ తేదీ ఎందుకు మారుతోందో తెలుసా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన ఖగోళ కారణం ఉంది.
భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో తన కక్ష్యలో వచ్చే చిన్న మార్పులే దీనికి ప్రధాన కారణం. భూమి తన అక్షం మీద తిరుగుతూ స్వల్పంగా దిశ మార్చుకోవడం వల్ల, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రతి సంవత్సరం సుమారు 20 నిమిషాల తేడా వస్తుంది. ఈ చిన్న వ్యత్యాసం అలా పేరుకుపోయి, సుమారు 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది.
అందుకే 1935 నుండి 2007 వరకు జనవరి 14న వచ్చిన సంక్రాంతి, 2008 నుండి జనవరి 15 కి మారింది. ఈ లెక్కన 2080 వ సంవత్సరం వరకు మనకు జనవరి 15 నే సంక్రాంతి వస్తుంది. ఆ తర్వాత, అంటే 2081 నుండి ఈ పండుగ జనవరి 16 కి మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే దీని బట్టి తిథిని పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది కూడా జనవరి 15వ తేదీ గురువారం నాడు తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోనున్నారు. పల్లెటూళ్లలో గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దుల కోలాహలంతో ఈ పండుగ సందడి నెలకొంటుంది
“తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ.. సంక్రాంతి పండుగని జరుపుకోండి.. తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి! మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026!”