హైదరాబాద్‌లోని మైలార్ దేవ్ పల్లెలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో 53 మంది చిక్కుకున్నారు. భవనం నుంచి బయటికి వెళ్లేందుకు ఉన్న మెట్ల దగ్గరే భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని వాళ్లంతా.. టెర్రస్ పైకి వెళ్లి ఆహాకారాలు చేశారు. సంఘటన స్థలానికి మూడు ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. లాడర్స్ ద్వారా టెర్రస్ పైన ఉన్న వాళ్ళని కిందికి దించారు. రెండవ అంతస్తు లో ఉన్న వాళ్ళందరిని మెట్ల ద్వారా కిందికి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది మొత్తం 53 మందిని రక్షించారు. అందులో 20 మంది చిన్న పిల్లలు ఉన్నారు. సకాలంలో భవనం వద్ద చేరి మంటలార్పడంతో 53 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
కాగా.. హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌చౌక్‌లో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. గుల్జార్‌హౌస్ సమీపంలోని ఒక భవనంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం నాలుగు కుంటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. భవనంలో మొత్తం 30 మంది సభ్యులు ఉండగా.. అందులో రెస్క్యూ సిబ్బంది 10 మందిని కాపాడారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో 10 మంది స్పృహ తప్పి అక్కడే పడిపోయారు.