Mahesh Kumar: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ గ్రామంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో అవినీతి, రాజకీయ సమస్యలపై స్పందించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు? గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా, కేసీఆర్ సేదతీరుతున్న ఫాం హౌస్ లో ఉన్నారు అని కేసీఆర్ పై విమర్శలు చేసారు. తెలంగాణలో బిఆర్ఎస్ దుకాణం బంద్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బిఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Read Also: Principal Slaps Teacher: టీచర్‌ను చెంప దెబ్బలతో వాయించేసిన ప్రిన్సిపాల్
పార్లమెంట్ ఎన్నికలలో మాదిరిగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పరోక్షంగా బిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుందని మహేశ్ గౌడ్ అన్నారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే, బడ్జెట్‌లో రాష్ట్రానికి గాడిద గుడ్డు తెచ్చారని ఆయన కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని.. బిఆర్ఎస్ లో కేటీఆర్, కవిత, హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని అన్నారు. బీసీల గురించి బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉండడంతో గజ్వేల్ రాజకీయ వాతావరణంలో మరింత ఉత్కంఠ పెంచాయి.