Mahesh Babu Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం అదేనా.?

Mahesh Babu Meets Revanth Reddy

Mahesh Babu Meets Revanth Reddy

Mahesh Babu Meets Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు శనివారం (నవంబర్ 28) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఈ సమావేశం జరిగింది. తొలుత సీఎం రేవంత్ రెడ్డికి మహేశ్ బాబు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకుని కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఏయే విషయాలు చర్చకు వచ్చాయనే దానిపై అధికారిక సమాచారం వెల్లడికాలేదు.

ఇదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, స్వతంత్ర మైక్రోఫిన్ చైర్‌పర్సన్ అనన్య బిర్లా కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమానికి ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అనన్య బిర్లాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై ఇండియా కూటమి తరఫున తన వాదనను వినిపించేందుకు ఆయన సిద్ధమయ్యారు. కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో కలిసి నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాలకు కలిగే నష్టాలు, దక్షిణాది రాష్ట్రాలపై పడే ప్రభావం వంటి అంశాలను ఈ సమావేశంలో వివరించనున్నట్లు సమాచారం. అలాగే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలకు సీఎం సూచించినట్లు సమాచారం.

మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.