ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా జమిలీ ఎన్నికలు, లేదా రాజకీయ ఎత్తుగడల గురించే చర్చ నడుస్తుంది. ఎన్నికల్లో ఏవిధంగా గెలవాలి అనే దానిపై ప్రతిపక్షాలు, అధికార పక్షాలు రెండూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ సందర్భంగానే మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
వైరల్ అవుతున్న ఈ ఆడియో క్లిప్ లో ఆయన తన పార్టీ కార్యకర్తలకు ఒక విషయం గురించి దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల సమయంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. వార్త సంస్థలు ఏ వ్యక్తి గురించైనా నెగిటివ్ గా చెబితే ఇక ఆ అభ్యర్థి పని అయిపోయినట్లే. అందుకే ఎన్నికల సమయంలో మీడియాతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు నాయకులు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా అరికట్టేందుకు జర్నలిస్టులను దాబాకి తీసుకు వెళ్లాలని చంద్రశేఖర్ బవాన్కులే కార్యకర్తలను కోరారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ అవుతూ తీవ్ర దుమారం రేపుతుంది. ఈ ఆడియోపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ ‘ప్రతిపక్షాల గొంతు ప్రజాస్వామ్యాన్ని వినిపిస్తుంది. అయితే బీజేపీ దానిని తొక్కేయడానికి ప్రయ్నతిస్తుంది ఎందుకంటే బీజేపీ దాన్ని అంగీకరించదు.
సమాజంలో మీడియా వర్గాలు పారదర్శకంగా పనిచేస్తాయి. కానీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియా ఎలా ప్రవర్తించాలో , ఏం మాట్లాడాలో పాఠాలు చెబుతున్నారు. ఇది ఏ మాత్రం అంగీకరించాల్సిన విషయం కాదు. ప్రజలకు, మీడియాకు ఆయన క్షమాపణ చెప్పాలి’ అని ఆమె మండిపడ్డారు. ఇక దీనిపై చంద్రశేఖర్ బవన్కులే స్పందిస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. జర్నలిస్టులు కూడా ఓటర్లే అని అందుకే వారిని కలిసి అభిప్రాయాలు తీసుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించానని ఆయన పేర్కొన్నారు. పాత్రికేయులను గౌరవంగా చూడాలన్న ఉద్దేశంతో కలవమన్నానని చెప్పుకోచ్చారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో మాట్లాడినా ఈ వీడియో క్లిప్ మాత్రం దుమారం రేపుతుంది.