మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోతోంది. భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించి.. దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి అద్దాల మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. రాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరగనుంది.
కాళేశ్వరం క్షేత్రంలో మహాశివరాత్రి శోభ కనిపిస్తోంది. తెలంగాణతో పాటు పొరుగున ఉన్న మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరంకు తరలివస్తున్నారు. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి.. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి.. అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.35కు వైభవంగా శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవం జరగనుంది. రాత్రి 12కు లింగోద్భవ పూజ జరగనుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
మహా శివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలంకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు నంది వాహనసేవ, ఆలయ ఉత్సవం ఉంటుంది. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామివారికి పాగలంకరణ.. రాత్రి 12 గంటలకు పార్వతి పరమేశ్వరుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం జరగనుంది. మహానంది క్షేత్రంలో నేడు రాత్రి 10 గంటలకు లింగోద్భవ సమయంలో మహా రుద్రాభిషేకం, స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది.