Madagascar: జనరల్-జెడ్ నిరసనలు మరొక దేశంలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాయి. మడగాస్కర్‌లో జనరల్-జెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న కొన్ని రోజుల తర్వాత కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా శుక్రవారం మడగాస్కర్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తిరుగుబాటు కారణంగా ఆండ్రీ రాజోలినా పదవీచ్యుతుడయ్యారు. ఆ దేశ ఉన్నత రాజ్యాంగ న్యాయస్థానంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైనిక పాలకుడు మైఖేల్ రాండ్రియానిరినా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమంలో జనాలు హర్షధ్వానాలు చేసిన వీడియోలు బయటికి వచ్చాయి.
READ ALSO: Minister Seethakka: తన తల్లిదండ్రుల సాక్షిగా.. హరీష్ రావుకి మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్..
పదవీచ్యుతుడైన మాజీ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా తిరుగుబాటును ఖండించారు. ఉన్నత రాజ్యాంగ న్యాయస్థానం సైనిక పాలనను ధృవీకరించినప్పటికీ, ఆయన అధికారికంగా రాజీనామా చేయడానికి నిరాకరించారు. దేశంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెల్లుబిక్కిన జెన్-జెడ్ తిరుగుబాటు తర్వాత ఆయన దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన ప్రవాసంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారన్నది తెలియలేదు. దేశంలో తిరుగుబాటుకు ముందు వారాల తరబడి జెన్-జెడ్ నిరసనలు జరిగాయి. వాస్తవానికి ఈ నిరసనలు ప్రారంభంలో నిరంతర విద్యుత్, నీటి కొరత కారణంగా జరిగాయి, కానీ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక నిరసనలుగా రూపాంతరం చెందాయి.
వాస్తవానికి ఆండ్రీ రాజోలినా 2009లో తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన ప్రభుత్వంపై కూడా తిరుగుబాటు రావడంతో అధికారాన్ని కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. దీనిపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం సందర్భంగా ఉన్నత రాజ్యాంగ న్యాయస్థానం వెలుపల విలేకరులతో 18 ఏళ్ల విద్యార్థి మియోటి ఆండ్రియాంబినింట్సోవా మాట్లాడుతూ.. “ఇది ఒక మైలురాయి. మా లక్ష్యాలు ఇంకా సాధించలేదు” అని అన్నారు. తోటి నిరసనకారుడు ఫ్రాంకో రామనావారివో మాట్లాడుతూ.. “ప్రజలకు దగ్గరగా ఉండే ప్రభుత్వాన్ని నడిపించడమే మా లక్ష్యం. మేము ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు” అని చెప్పారు.
మడగాస్కర్‌లో సైనిక పాలన
మడగాస్కర్ ఆర్మీ ఎలైట్ మిలిటరీ యూనిట్, CAPSAT (ఆర్మీ కార్ప్స్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ సర్వీసెస్) కమాండర్ మైఖేల్ రాండ్రియానిరినా శుక్రవారం వలసరాజ్యాల కాలం నాటి భవనం అయిన హై కాన్స్టిట్యూషనల్ కోర్టు వద్ద జరిగిన కార్యక్రమంలో దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా ఆయన జాతీయ ఐక్యత, మానవ హక్కులను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. దేశంలో కొత్త ఎన్నికలు జరిగే వరకు, సైనిక నేతృత్వంలోని కమిటీ రెండు ఏళ్లపాటు మడగాస్కర్‌ను పరిపాలించనుందని ఆయన ప్రకటించారు.
ఇటీవలి ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా నిరసనకారులపై కాల్పులు జరపవద్దని రాండ్రియానిరినా దళాలను ఆదేశించారు. ఆఫ్రికన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మడగాస్కర్‌లో జరిగిన తిరుగుబాటును ఖండించారు. మడగాస్కర్‌లో అశాంతి తీవ్ర పేదరికానికి ఆజ్యం పోస్తోంది. మడగాస్కర్‌లోని 3 కోట్ల జనాభాలో యువత అసమానంగా ఉన్నారు. మడగాస్కర్‌లో సగటు వయస్సు 20 ఏళ్లలోపు, దేశంలో మూడొంతుల మంది దారుణమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు. మడగాస్కర్‌లో సగటు వార్షిక ఆదాయం ఒక్కొక్కరికి $600 గా ఉంది. దేశంలో బియ్యం, ఇతర ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
READ ALSO: China : చైనాలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి సైన్యం నుంచి ఔట్ !