రియల్ ఎస్టేట్ సెక్టార్ లో నయా ట్రెండ్ నడుస్తోంది. ఇళ్లు, ప్లాట్లు సేల్ కాకపోవడంతో యజమానులు వినూత్నంగా ఆలోచించి లక్కీ డ్రా పద్దతికి తెరలేపుతున్నారు. లక్కీ డ్రా ద్వారా అమ్ముకునేందుకు రెడీ అవుతున్నారు. రూ. 500 నుంచి రూ. 1000 వరకు కూపన్లను విక్రయించి, డ్రాలో గెలుచుకున్న వారికి ఆస్తులు ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హల్ చల్ చేస్తోంది. నల్గొండకు చెందని రమేశ్ తన ఆరు గదుల ఇంటిని రూ. 999 కూపన్లతో లక్కీ డ్రాలో పెట్టగా, యాదాద్రి చౌటుప్పల్ లో మరో వ్యక్తి రూ. 500 కూపన్ డ్రా ద్వారా ఇల్లు విక్రయించి రూ. 18 లక్షలు సంపాదించాడు. దీంతో తక్కువ పెట్టుబడితో ఇల్లు గెలుచుకునే ఆశతో ప్రజలు ఈ నయా ట్రెండ్ వైపు ఆకర్షితులవుతున్నారు.
Also Read: Jr NTR New Look: మీసం తిప్పిన ఎన్టీఆర్.. టైగర్ కేక పెట్టించేలా ఉన్నాడుగా!
ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ కుటుంబం రూ. 16 లక్షల విలువైన ఇంటిని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రేకుల గదితో సహా 66 గజాల ఇంటి స్థలం అమ్మకానికి లక్కీడ్రా పద్ధతి పెట్టారు యజమాని కంచర్ల రామబ్రహ్మం. రూ.500 విలువైన కూపన్‌ను కొనుగోలు చేసి లక్కీడ్రాలో పాల్గొనాలని ఆ ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టారు. ఈ లక్కీ డ్రాలో సంగారెడ్డి జిల్లాకు చెందిన శంకర్ కుమార్తె హన్సిక(10నెలలు)ను అదృష్టం వరించింది. రూ.16లక్షల విలువైన ఇంటిని ఆమె లక్కీడ్రాలో గెలుచుకుంది. కేవలం రూ. 500 రూ. 1000 తోనే లక్షల విలువైన ఇల్లును సొంతం చేసుకునే ఛాన్స్ కల్పిస్తోంది లక్కీ డ్రా. అయితే తెలంగాణలో లక్కీ డ్రా చట్టబద్ధం కాకున్నా కొందరు యజమానులు తమ ప్రాపర్టీలను సేల్ చేసుకునేందుకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఆశించిన దానికంటే ఎక్కువ సొమ్ము రావడంతో ఇటు యజమాని, తక్కువ ఖర్చుతో లక్షల విలువైన ఇల్లు సొంతం కావడంతో అటు లక్కీ డ్రా గెలుచుకున్నవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.