LSG Vs KKR: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. భారీ స్కోరు చేసినప్పటికీ, చివరి వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా, బ్యాటర్ల విధ్వసంతో 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో మిచెల్ మార్ష్ 81 పరుగులతో చెలరేగగా, నికోలస్ పూరన్ కేవలం 36 బంతుల్లోనే అజేయంగా 87 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆదెన్ మార్క్రమ్ 47 పరుగులు చేశాడు.
Read Also: Srinivasa Reddy: ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేసి పేదల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారు
ఇక 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు కూడా పోటీనివ్వడంతో మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా మారింది. కెప్టెన్ అజింక్యా రహానే 61 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 45, నరైన్ 30 పరుగులు, రింకూ సింగ్ 38 పరుగులతో టఫ్ ఫైట్ ఇచ్చారు. చివరి వరకు ప్రయత్నించినప్పటికీ కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, షార్దుల్ ఠాకూర్ 2 వికెట్లతో మంచి ప్రదర్శన కనబరిచారు. అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాథీ, రవీ బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.