పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరు. కారణం ఏదైనా సమయానికి చేరుకోవాలని పబ్లిక్ పరీక్షల సమయంలో అధికారులు చెబుతూనే ఉంటారు. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థులు లోపలికి అనుమతించమని ఏడుస్తూ.. ఉపాధ్యాయులు, అధికారుల కాళ్లవేళ్ల పడటం మనం చూస్తుంటాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి సైతం పరీక్షకాలంగా మారింది. నామినేషన్ వేయడానికి చివరి రోజు నిమిషం ఆలస్యంగా వచ్చిన అతడిని ఎన్నికల అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో అధికారి కాళ్ల వేళ్ల పడ్డాడు.
READ MORE: Anupama: చెప్పినట్టుగానే ‘పరదా’ తొలగించుకు వస్తున్నా.. అనుపమ కీలక వ్యాఖ్యలు
ఎస్సీ రిజర్వుడు అయిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో దళిత బహుజన పార్టీ అభ్యర్థిగా మాతంగి హనుమయ్య పోటీకి సిద్దమయ్యారు. అన్ని పత్రాలు సిద్దం చేసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి రోజు పెద్దపల్లి కలెక్టర్ భవనంలోని ఆర్వో కార్యాలయానికి చేరారు. అప్పటికి సరిగ్గా సమయం మధ్యాహ్నం 3:01 అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు తీసుకుంటారు. హనుమయ్య ప్రధాన గేటు దగ్గరకు వచ్చేసరికి మూడు గంటల ఒక్క నిమిషం అయ్యింది. అప్పటికే అక్కడ ఉన్న అధికారులు హనుమయ్య లోనికి అనుమతించలేదు. ప్లీజ్ సార్ లోపలికి అనుమతించడని అతడు వేడుకున్నారు. కాళ్ల వేళ్ల పడి బ్రతిమలాడినా అధికారులు ఒప్పుకోలేదు. దీంతో అతడు ఆవేదనతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉంది. కాబట్టే అధికారులను వేడుకున్నాడు. కాని ఎన్నికల సంఘం ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు వారం రోజుల సమయం ఇచ్చింది. పోటీ చేయాలనుకునే హనుమయ్య ఏదో ఒకరోజు నామినేషన్ వేయచ్చు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి 83 మంది అభ్యర్థులు 110 నామినేషన్ దాఖలు చేశారు. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, ఎస్.కుమార్ నామినేషన్ వేశారు.