Rahul Gandhi Gave update on Amethi Seat: లోక్‌సభ ఎన్నికలు 2024లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేదెవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కంచుకోటగా ఉన్న అమేథీ స్థానం నుంచి బీజేపీ తరఫున కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా.. కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే అమేథీ స్థానంపై రాహుల్ గాంధీ స్పందించారు.
నేడు ఘజియాబాద్‌లో సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేయడంపై రాహుల్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘సీఈసీ, కాంగ్రెస్ అధ్యక్షుడు నన్ను ఏం చేయమని కోరితే అది చేస్తాను. అన్ని నిర్ణయాలు సీఈసీలో తీసుకుంటారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా’ అని రాహుల్ గాంధీ అన్నారు. త్వరలోనే అమేథీ స్థానంపై క్లారిటీ ఇస్తామని రాహుల్ చెప్పకనే చెప్పారు.
Also Read: Dubai Rains: ఇది ముంబై కాదు దుబాయ్.. ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే!
కేరళలోని వాయనాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు అమేథీ నుంచి గెలుపొందారు. అయితే 2019లో స్మృతి ఇరానీ 55,000 ఓట్లతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిపై గెలుపొందారు. అమేథీ నుంచి స్మృతి మళ్లీ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. యూపీలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుండగా.. మే 20న అమేథీలో పోలింగ్ జరగనుంది.