Liz Truss: బ్రిటన్‌లో అతి తక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిగా నిలిచారు లిజ్ ట్రస్. కేవలం 45రోజులు మాత్రమే ఆమె ఆ పదవిలో ఉన్నారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న బ్రిటన్‌లో పరిస్థితులు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఆమె రాజీనామా చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం, ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పడంతో లిజ్ ట్రస్ పదవి నుంచి తప్పుకున్నారు. తద్వారా బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తిగా లిజ్ ట్రస్ రికార్డుల్లోకెక్కారు. మినీ బడ్జెట్‌తో పాటు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధాని కూడా తప్పుకోవడం కలకలం రేపింది.
పదవిలో ఉన్నది 45 రోజులే అయినా బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్‌కు ఇకపై ఏటా రూ.కోటి రూపాయల అలవెన్స్ వస్తుందట. ప్రధానిగా పనిచేసేందుకు పబ్లిక్ డ్యూటీ కాస్ట్ అలవెన్స్(PDCA) పొందేందుకు అర్హత సాధించారు. లిజ్ ట్రస్ ఏడాదికి సుమారు రూ.1.05 కోట్లు (1,15,000 పౌండ్లు) ప్రభుత్వం నుంచి జీవితాంతం భత్యంగా అందుకోనున్నారు. యూకే చట్టాల ప్రకారం దేశ ప్రధానిగా పనిచేసిన వాళ్లు మరణించే వరకు ఏటా ఆర్థిక సాయం అందుతూనే ఉంటుంది. మాజీ ప్రధానమంత్రులకు జీవితాంతం సహాయం అందించేందుకు 1991లో పీడీసీఏను ప్రవేశపెట్టారు. అయితే ట్రస్ ఆ దేశ ప్రధానిగా పనిచేసిందేం లేదు. పన్నుల కోత హామీలతో ప్రధాని ఎన్నికల్లో నెగ్గిన ఆమె.. ఆర్థికంగా ఆలోచన లేని నిర్ణయాలు తీసుకొని అసలే కష్టాల్లో ఉన్న యూకే ఆర్థిక వ్యవస్థను మరింత గందరగోళ పరిస్థితుల్లో పడేశారు. దీనికి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు.
FATF Pakistan: దాయాది పాక్‌కు ఊరట.. నాలుగేళ్ల తర్వాత గ్రే లిస్ట్ నుంచి తొలగింపు
వివాదాస్పద నేతగా రాజీనామా చేసిన ఆమెకు ఈ భత్యాన్ని ఇవ్వవద్దనే వాదన బ్రిటన్‌లో మొదలయ్యింది. ఇంత తక్కువ సమయం ప్రధానిగా పనిచేసిన ఆమెకు ఇలా ఏటా రూ.కోటిపైగా చెల్లించడం సబబుకాదని కొందరు వాదిస్తున్నారు. ఆమెకు ఈ అలవెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్న కొందరు విశ్లేషకులు.. ప్రభుత్వం ఇచ్చినా ఆమె ఈ అలవెన్స్ నిరాకరిస్తే బాగుంటుందని, ప్రజల డబ్బు ఇలా వృధా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.