Liechtenstein: ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైన దానికంటూ ఒక సొంత కరెన్సీ అనేది ఉంటుంది. కానీ ఒక దేశానికి సొంత కరెన్సీ లేకున్నా.. సంపన్న దేశంగా అవతరించింది. ఇది ఎలా సాధ్యపడింది. వాస్తవానికి ఒక దేశం పురోగతి గురించి మాట్లాడేటప్పుడు, తరచుగా పెద్ద సైన్యం, విశాలమైన భూభాగం, అంతర్జాతీయ విమానాశ్రయాలు, శక్తివంతమైన కరెన్సీ వంటి వాటి గురించి చర్చ రావడం సహజం. కానీ ఇవేవీ లేకుండానే ఒక చిన్న యూరోపియన్ దేశం ప్రపంచంలోని అత్యంతం సంపన్న దేశాల జాబితాలో ఒకటిగా చేరింది. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటో తెలుసా.. లీచ్టెన్‌స్టెయిన్. వాస్తవానికి ఈ దేశం తన సొంత కరెన్సీని ముద్రించదు, అలాగే దీనికి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. అయినా కూడా ఇది అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా ఉంది. ఎలాగో తెలుసా…
READ ALSO: Cyclone Montha: ప్రజలను అప్రమత్తం చేయండి.. రైతులకి ముందస్తు సమాచారం ఇవ్వండి: పవన్
లీచ్టెన్‌స్టెయిన్ ప్రత్యేకత ఏంటి..
యూరప్ నడిబొడ్డున ఉన్న ఒక చిన్న దేశం లీచ్టెన్‌స్టెయిన్. కానీ ఈ దేశం అత్యంత అభివృద్ధి చెందిన దేశం. ఇది స్విట్జర్లాండ్ – ఆస్ట్రియా మధ్య ఉంది. దీనికి అంతర్జాతీయ విమానాశ్రయం లేనప్పటికీ, ఈ దేశం ప్రపంచంతో బాగా అనుసంధానించబడి ఉంది. ప్రజలు స్విట్జర్లాండ్ లేదా ఆస్ట్రియాలోని విమానాశ్రయాల ద్వారా ఈ దేశానికి సులభంగా ప్రయాణించవచ్చు. అలాగే దీనికి రోడ్లు, రైల్వేల ద్వారా బలమైన నెట్‌వర్క్ సౌకర్యం ఉంది.
ఈ దేశానికి స్వంత కరెన్సీ లేదు. వాస్తవానికి ఈ దేశం సొంత కరెన్సీ ముద్రించడానికి బదులుగా, స్విట్జర్లాండ్ దేశ కరెన్సీ అయిన స్విస్ ఫ్రాంక్‌ను తమ దేశ కరెన్సీగా స్వీకరించింది. ఈ దేశంలో కేంద్ర బ్యాంకును నడపడం, డబ్బును ముద్రించడం లేదా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం వంటి సంక్లిష్ట బాధ్యతలు లేవు. వాస్తవానికి ఈ నిర్ణయం అనేది దేశ ఆర్థిక స్థిరత్వం, కరెన్సీ బలాన్ని మరింత పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశానికి బలం తయారీ కేంద్రం..
లీచ్టెన్‌స్టెయిన్ దేశం చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, దేశంలో ఉన్న తయారీ రంగం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అధిక-నాణ్యత గల పారిశ్రామిక పరికరాలు, దంత యంత్రాలు, ఆటోమొబైల్ భాగాలు, అంతరిక్ష సాంకేతికతలో ఉపయోగించే భాగాలు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఈ దేశానికి చెందిన ప్రఖ్యాత కంపెనీ హిల్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లీచ్టెన్‌స్టెయిన్‌లో పౌరుల కంటే ఎక్కువ కంపెనీలు నమోదయ్యాయి. అందుకే ఈ దేశంలో నిరుద్యోగం లేదు.. సగటు పౌరుడి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. లీచ్టెన్‌స్టెయిన్ కేవలం సంపన్న దేశం మాత్రమే కాదు.. చాలా సురక్షితమైన దేశం కూడా. దేశంలో నేరాల రేటు చాలా తక్కువగా ఉండటంతో ఇక్కడి ప్రజలు వాళ్ల ఇళ్ల తలుపులకు తాళం కూడా వేసుకోరు. వాస్తవానికి దేశంలోని ఉన్న తక్కువ జనాభా, కఠినమైన శాంతిభద్రతలు, ఉన్నత జీవన ప్రమాణాల కారణంగా ఇక్కడ నేరాలు దాదాపుగా నిర్మూలించడం జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: US – China: చైనా సహాయం కోరిన అమెరికా.. ఏ విషయంలో అంటే!