Site icon NTV Telugu

KTR : కొందరు పోలీసులు రేవంత్‌ రెడ్డి ప్రైవేట్‌ సైన్యంలా వ్యవహరిస్తున్నారు

Ktr

Ktr

KTR : లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గిరిజనుల పట్ల జరిగిన అన్యాయాన్ని, పోలీసుల ప్రవర్తనను, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. లగచర్ల గ్రామస్తుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందంటూ ఢంకా మోగించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం లగచర్ల గిరిజన ఆడబిడ్డలు స్వచ్ఛందంగా లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఇది రాజకీయ సభలకు సాధారణంగా లభించే విరాళం కాదు, వారి ఆత్మబలమైన సంకేతం. “బీఆర్ఎస్ లాంటి పార్టీ మాకు అండగా ఉంది కాబట్టే మేము ఈ సహాయం చేస్తున్నాం,” అని ఆడబిడ్డలు పేర్కొనడం విశేషం. ప్రభుత్వం 40 మంది లగచర్ల రైతులను అరెస్టు చేసి జైళ్లలో చిత్రహింసలకు గురిచేసిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యంగా హీర్యా నాయక్ అనే రైతుకు గుండెనొప్పి వచ్చినప్పుడు కూడా పోలీసులు కట్టేసిన సంకెళ్లతోనే ఆసుపత్రికి తరలించారని, ఇది మానవత్వానికి వ్యతిరేకమని మండిపడ్డారు.

లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ-ఎస్టీ కమిషన్‌లు స్పందించాయని, పోలీసులు అప్రజాస్వామికంగా ప్రవర్తించారని రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. “పోలీసులు ప్రయివేటు సైన్యంలా, మానవ మృగాల్లా ప్రవర్తించారన్న ఆరోపణలు నిజమయ్యాయి,” అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్ల నరకడం, లగచర్ల రైతులపై దాడి వంటి అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ, జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్ర విమర్శలు చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక పరాభవంగా నిలిచిందన్నారు.

“రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత కోల్పోయారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి,” అంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. “కొడంగల్ ప్రాంతంలోని ఆడబిడ్డలకు జరిగిన అవమానం వల్ల రేవంత్ రెడ్డి వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి,” అని కేటీఆర్ స్పష్టం చేశారు. లగచర్ల రైతులపై దాడి చేసిన పోలీసులను సర్వీసు నుండి తొలగించాలని డిమాండ్ చేసిన కేటీఆర్, “చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది,” అని హెచ్చరించారు. “ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు పదవీ విరమణ తర్వాత కూడా వదిలిపెట్టం,” అని అధికారులకు హెచ్చరికలు చేశారు. ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ చర్యలను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ప్రజల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించింది.

US India trade deal: అమెజాన్, వాల్‌మార్ట్‌కి పూర్తి మార్కెట్ యాక్సెస్.. భారత్‌పై అమెరికా ఒత్తిడి..

Exit mobile version