నల్లగొండ జిల్లా చండూరులో వామపక్షాల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హజరయ్యారు. అయితే.. ఈ సందర్భంగా… మునుగోడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మా కుటుంబం కమ్యూనిస్టు నేపథ్యం గల కుటుంబమన్నారు. సభకు వచ్చిన కమ్యూనిస్టులు చూస్తుంటే మా పూర్వీకులను చూసినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కన్నీళ్లు తుడవాలి దోపిడీ వ్యతిరేకంగా పనిచేయాలని ఆలోచనతోనే పెరిగానని, 2014లో మొదటిసారి గెలిపించిన మునుగోడు ప్రజలకు అభివృద్ధి చేసి చూపించానన్నారు.
2018లో అభివృద్ధి చేశాను కాబట్టి రెండోసారి గెలిపిస్తారని అనుకున్న.. కానీ డబ్బు ప్రభావంతో ఓడిపోయానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, సరైన సమయంలో కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు వారికి నా ధన్యవాదాలు అని ఆయన అన్నారు. కమ్యూనిస్టులకు నా జన్మంతా రుణపడి ఉంటానని, నా జీన్స్ కమ్యూనిస్టు జీన్స్ అని చెప్పడానికి, చెప్పుకోవడానికి గర్వపడుతున్నానన్నారు. నావల్ల చిన్నచిన్న పొరపాట్లు జరిగితే నన్ను క్షమించండి… నాకు సహకరించండని ఆయన కోరారు.