Kurnool Bus Fire Accident Mystery Solved: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది. చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. బైక్ నడుపుతూ చనిపోయిన శివశంకర్‌తో పాటు ఎర్రిస్వామి అనే వ్యక్తి ఉన్నాడు. చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడై డివైడర్‌ను ఢీకొట్టాడు. దాంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడు. అదే సమయంలో బైక్‌ను కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీ కొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. ఆ సమయంలో బస్సు కింద మంటలు వచ్చి అంతా వ్యాపించాయి.
‘ఎర్రిస్వామి, శివశంకర్ కలిసి లక్ష్మీపురం నుండి శుక్రవారం తెల్లవారుజాము 2 గంటలకు బయలు దేరారు. ఎర్రిస్వామిని వదలడానికి శివశంకర్ తుగ్గలికి బయలు దేరాడు. దారిలో కియా షోరూం దగ్గర హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో తెల్లవారుజామున 2.24 గంటలకు రూ.300 పెట్రోల్ పోయించుకొని బయలు దేరారు. బయలు దేరిన కొద్దిసేపటికి చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడై డివైడర్‌ను ఢీకొట్టాడు. శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడు. ప్రమాద స్ధలం దగ్గర రోడ్డు మధ్యలో నుండి శివశంకర్‌ను బయటికి లాగి శ్వాస చూడగా.. అతడు చనిపోయాడని ఎర్రిస్వామి నిర్దార్ధించుకున్నాడు. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను తీద్దామనుకునే సమయంలోనే కావేరి ట్రావెల్స్ బస్సు దోసుకొచ్చింది. బైక్‌ను బస్సు ఢీకొట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్ళింది. బస్సు క్రింద మంటలు రావడంతో ఎర్రిస్వామి బయపడి అక్కడి నుండి తన స్వంత ఊరు తుగ్గలికి వెళ్ళిపోయాడు. ఉలిందకొండ పీఎస్లో కేసు నమోదు చేస్తున్నాం. ఈఘటనపై దర్యాప్తు చేస్తాం’ అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పారు.