KTR Slams Congress Govt over Urea Shortage: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు పరిపాలన చేతకాని వారి వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ముందుచూపు, పాలన అంటే ఏంటో జనాలకు ఇప్పుడు అర్థమైందని.. రైతును అరిగోస పెడుతున్న వారి పతనం ప్రారంభమైందన్నారు. నాడు కేసీఆర్ యూరియా కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించారన్నారు. వ్యవసాయ అధికారుల నుంచి రైల్వే శాఖ వరకు కేసీఆర్ స్వయంగా సమన్వయం చేశారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
‘రైతును అరిగోస పెడుతున్న వారి పతనం ప్రారంభమైంది. కేసీఆర్ ముందుచూపు, పాలన అంటే ఏంటో ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. చిల్లర రాజకీయాలు చేసే అసమర్థుల వల్లే రైతులకు ఈ కష్టాలు వచ్చాయి. వందేళ్ల విజన్ ఉన్న కేసీఆర్‌కు, బూతులు మాట్లాడే వారికి తేడా ప్రజలకు అర్థమైంది. నాడు కేసీఆర్ యూరియా కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. వ్యవసాయ అధికారుల నుంచి రైల్వే శాఖ వరకు కేసీఆర్ స్వయంగా సమన్వయం చేశారు. యూరియా కోసం ప్రత్యేకంగా గూడ్స్ ట్రెయిన్లు, లారీలు ఏర్పాటు చేయించారు. గ్రామాల్లోనే యూరియా సరఫరా చేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు పరిపాలన చేతకాని వారి వల్లనే ఈ దుస్థితి నెలకొంది’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Also Read: Bhatti Vikramarka: పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వలేదు.. పైగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు!
ఆగస్టు మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులకు యూరియా ఆవశ్యకత ఏర్పడింది. వరి, పత్తి, కందులు, మొక్కజొన్న, మిర్చి, బంతి లాంటి పంటలకు యూరియా వేసే సమయం కాబట్టి రైతులు ఎగబడుతున్నారు. సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. డిమాండుకు సరిపడా ఎరువులు లేకపోవడంతో.. దుకాణాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు.కొన్నిచోట్ల రైతులు యూరియా కోసం వారం రోజులుగా పట్టాపాస్ పుస్తకాలు, చెప్పులు వరుసలో పెడుతున్నారు. ఇంకొందరైతే అక్కడే నిద్రిస్తున్నారు కూడా.
