మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో కార్తకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని విషయాలలో మనం మార్కెటింగ్ సరిగ్గా చేసుకోలేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కేసీఆర్ గురించి చెప్పడంలో మనం విఫలం అయ్యాము.. 1940 లో మొదలు పెడితే ఏపీలో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు.. కానీ అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు.. కెసిఆర్ చెబుతుంటే పెన్ను పట్టుకొని రాసుకోండి అంటే మాకే కోపం వచ్చేదని అన్నారు.
కానీ అర్థం చేసుకున్న తర్వాత వాళ్లకు కాళేశ్వరం గొప్పతనం తెలిసింది.. సాగునీరు మాత్రమే కాదు.. హైదరాబాద్ కు తాగునీళ్లు తెచ్చేందుకు కాళేశ్వరం కట్టారు.. కాళేశ్వరం కూలేశ్వరం అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది.. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టాలి.. రూపాయి పైసా కూడా ప్రజల సొమ్ము వృధా కాలేదు.. కానీ కమీషన్ వేసి డబ్బులు ఖర్చు చేశారు.. అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు అక్బరుద్దీన్ ఓవైసీ నిలదీస్తే సమాధానం లేదు.. ఈ డాక్యుమెంటరీ ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాలి అని సూచించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి రిపోర్ట్ ను అందించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించింది.
