KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ

Ktr

Ktr

KTR Reviews Nani’s The Paradise: న్యాచురల్ స్టార్ నాని నటించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్‌ 35mm థియేటర్‌లో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిలత కలిసి సినిమాను చూశారు. అనంతరం కేటీఆర్ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘‘అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా!!’’ You know who that is” అని ఎక్స్ వేదికగా కేటీఆర్ తన రివ్యూని పంచుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే శంకరన్న పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కనిపించగానే అభిమానులు పెద్ద ఎత్తున అరిచారు. ఆ సీన్‌ రాగానే కేటీఆర్ సైతం చిరునవ్వు చిందించడం ఆకట్టుకుంది. ఇక, ఈ సినిమా అయిపోగానే థియేటర్ బయట కేటీఆర్ మాట్లాడుతూ.. ఓ సమాజంపై అణిచివేత జరిగినప్పుడు ఒక నాయకుడు వచ్చి పోరాటం చేసి గుర్తింపు తెచ్చిన కథ అద్భుతంగా ఉందన్నారు. తెలంగాణ, యాస, భాషతో సినిమాను తీర్చిదిద్దారని, ఇది ఎంతో ఆకట్టుకుందని కొనియాడారు.