KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ లేఖ

Ktr

Ktr

KTR: రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి” అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించిన కేటీఆర్, కొనుగోలు కేంద్రాల్లో రైతులు మరణిస్తున్న ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి ఇంకా మొద్దు నిద్రలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన, రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడని, రాస్తారోకో జరగని రహదారి లేదని విమర్శించారు. రైతులు తమ పంటలను తామే తగలబెట్టుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత, కొనుగోలు కేంద్రాల్లో తరుగుల వ్యవహారం, రైతులకు బోనస్ చెల్లింపుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. పంటలు కొనలేని పరిస్థితి ఉంటే రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, ఈ నెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతుల సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. “కాంటా కూడా పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల చేతిలో కౌంట్‌డౌన్ ప్రారంభమైంది” అంటూ హెచ్చరించిన కేటీఆర్, సీఎం రేవంత్ చరిత్రలో రైతు ద్రోహిగా మిగలొద్దని సూచించారు. చివరగా “జై కిసాన్.. జై తెలంగాణ” అంటూ తన లేఖను ముగించారు.