హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి హబ్’ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, మార్గదర్శకత్వంలో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయం పట్ల ప్రేమ, సాగునీటి రంగంపై ఉన్న శ్రద్ధతో ఈ ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయ, సాగునీటి రంగంలో ఏ రాష్ట్రం సాధించని అద్వితీమయమైన విజయాలను సాధించిందన్నారు.
ప్రపంచం అబ్బురపడే విధంగా మూడున్నరేండ్ల కాలంలో కాళేళ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కృష్ణా, గోదావరి జీవనదుల్లోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి.. సాగుకు యోగక్యమైన భూమికి నీరందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడేండ్లలో ధాన్యం దిగుబడి పెరిగిందని… ఇవాళ తెలంగాణ ధాన్య భాండాగారంగా మారిందన్నారు. రైతులకు అండగా ఉంటున్నామని ఒకప్పుడు మనదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఆహార భద్రత ఒక సవాల్‌గా ఉండేదని వివరించారు కేటీఆర్. ఈ జనాభాకు సరిపడా ఆహారం ఉత్పత్తి చేయగలుగుతామా? అనే సందేహం ఉండేదని…. ఇప్పుడు ఆహార భద్రతను సాధించామన్నారు. కానీ ప్రస్తుతం పోషాకాహార భద్రత ఒక సవాల్‌గా మారిందని… కొవిడ్ వ్యాపించిన తర్వాత ప్రజలందరూ న్యూట్రిషన్ ఫుడ్‌పై మక్కువ చూపుతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.