NTV Telugu Site icon

KTR: ముఖ్యమంత్రి గుంపుమేస్త్రీ, ప్రధాని మంత్రి తాపీ మేస్త్రీ

Ktr

Ktr

KTR: విశ్వేశ్వరెడ్డి, రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించారని.. రంజిత్ రెడ్డి అయితే మరీ దారుణంగా మోసం చేశాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్‌లో ఆనంద్ ను ఓడిపోయేలా చేశారని విమర్శించారు మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి పరిగి సమావేశంలో డ్రామాలు చేశారు. యాక్టింగ్‌కు ఆస్కార్ ఇస్తే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలకు మాత్రమే ఇవ్వాలన్నారు. మహేందర్ రెడ్డిని జీవితంలో మంత్రిని చేసింది కేసీఆరేనని, అనామకుడు రంజిత్ రెడ్డిని ఎంపీ చేసింది కూడా ఆయనేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను, పార్టీని మోసం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు.

Read Also: Manda Krishna: తన బిడ్డ భవిష్యత్‌ కోసమే.. కడియం శ్రీహరిపై మందకృష్ణ ఫైర్

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన కాసానిని గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల లిస్ట్ చూడాలని.. మొత్తం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోయిన వాళ్లేనన్నారు. మోడీ హవా ఉంటే పక్కా పార్టీల నుంచి కాళ్లు పట్టుకొని ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. చేవెళ్లలో బీజేపీకి ఓటు ఎందుకు వెయ్యలేదని అడిగారు. కొత్త ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఐటీఐఆర్ తీసుకపోయారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే? ఎందుకు మోడీకి ఓటు వేయాలే అంటూ ప్రశ్నలు గుప్పించారు. రాముడికి మొక్కుదాం…బీజేపీని తొక్కుద్దామన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాముడు బొమ్మతో రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. దేశానికి, పేదలకు చేసిందేమీ లేదు… కనుకనే దేవుడు పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. ఒక్క మెడికల్ కాలేజ్, నవోదయ పాఠశాల ఇయ్యని, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అని మోసం చేసిన దిక్కు మాలిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

70 రూపాయల పెట్రోల్‌ను 110 చేసినందుకా? డిజీల్ రేట్లు పెంచినందుకా? సిలిండర్ రేట్లు పెంచినందుకా? పప్పు, ఉప్పులు ఫిరం చేసినందుకా? ధరలు పెంచినందుకా ఎందుకు బీజేపీకి ఓటు వేయాలని కేటీఆర్‌ ప్రశ్నలు గుప్పించారు. మోడీ ప్రియమైన ప్రధాని కాదు…పిరమైన ప్రధాని అంటూ విమర్శించారు. 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల రూపాయలు అకౌంట్లలో వేశారా? ఎందుకు బీజేపీకి ఓటు వేయాలని అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కుమాలిన పోటీ అని.. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పదేళ్ల నిజానికి, 100 రోజుల అబద్ధానికి మధ్య పోటీ అని ఆయన అన్నారు. మొన్నటి ఓటమిని ఇప్పుడు విజయానికి మెట్టుగా చేసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నే చేస్తా అన్నాడని.. కానీ ఇప్పుడు ఆ విషయం సీరియస్‌గా తీసుకోవద్దు అని చెప్తున్నారని అన్నారు.

Read Also: CM YS Jagan: జన నేతకు ఘన స్వాగతం.. 14 భారీ క్రేన్‌లతో ఇలా..

సిగ్గు లేకుండా ఇప్పుడు పరిపాలన తన చేతిలో లేదని.. ఎన్నికల సంఘం చేతిలో ఉంది అంటున్నాడన్నారు. ముఖ్యమంత్రి గుంపుమేస్త్రీ, ప్రధాని మంత్రి తాపీ మేస్ర్తీ అని కేటీఆర్‌ అన్నారు. వాళ్లిద్దరూ తెలంగాణకు సమాధి కట్టేందుకు కలిసి పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చేవేళ్లలో గెలవమని తెలిసే సీఎం అక్కడి ఇంఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నాడన్నారు. బీఆర్ఎస్ సమావేశాలకు వెళ్లొద్దని రంజిత్ రెడ్డి అందరికీ ఫోన్లు చేస్తున్నాడని.. పార్టీ మారిన వ్యక్తి గురించి మనకు అవసరమా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక పార్టీలో ఉండి మరొక పార్టీకి పనిచేస్తే విలువ ఉంటదా? అవకాశవాదిని ఓడించాలన్నారు. రంజిత్ రెడ్డి మనకు శత్రువే… ఆయనను కచ్చితంగా ఓడించాల్సిందేనన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో, కేసీఆర్ కూతురును అరెస్ట్ చేసిన సమయంలో నవ్వుతూ కాంగ్రెస్ చేరిన వ్యక్తికి మనం మద్దతుగా ఉండాలా అంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నాయకుడిగానే మాట్లాడుతున్నాడన్నారు. మల్కాజ్‌గిరిలో పోటీకి రమ్మంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేదని.. ఓడిపోతామని రేవంత్‌కు తెలుసన్నారు. మల్కాజ్‌గిరి, చేవెళ్లలో డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టాడన్నారు. చేవెళ్లలో మనకు బీజేపీతోనే పోటీ అని కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొడితే మానవబాంబు అవుతా అని రేవంత్ రెడ్డి అంటున్నారని.. ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం మాకు లేదన్నారు. తన పక్కనే నల్గొండ, ఖమ్మం మానవబాంబులే తనను పడగొడుతాయి చూసుకోవాలన్నారు. రేవంత్ 5 ఏళ్లుగా సీఎంగా ఉండాలని, చెప్పిన 420 హామీలు అమలు చేయాలే అని తాము కోరుకుంటున్నామన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు మగాడివైతే అంటాడు కదా..నేను కూడా రేవంత్ నువు మగాడివైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చు అంటున్నామన్నారు. మగాడివైతే పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురా అంటూ సవాల్ విసిరారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే..మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకోపోయినా తనకు ఓటు వేశారని అంటాడన్నారు.

Read Also: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ తెనాలి పర్యటన వాయిదా.. కారణం ఏంటంటే?

కేటీఆర్ మాట్లాడుతూ..” రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా? మోడీ కోసం పనిచేస్తుండా ?. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్ట మొదటి వ్యక్తి జంపింగ్ జపాంగ్ రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్లటం పక్కా. ఈ విషయం మీద 15 సార్లు అన్నప్పటికీ ఎందుకు రేవంత్ స్పందిచటం లేదో చెప్పాలె. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ కేసీఆర్ చెల్లని వెయ్యి రూపాయల నోటు అంటున్నాడు. కానీ కాంగ్రెస్‌కు 40 సీట్లు రావని ఇండియా కూటమి నేతలే అంటున్నారు. ఈ లెక్కన ఎవ్వరూ చెల్లిని వెయ్యి రూపాయలో చెప్పాలె. మొన్నటి ఓటమి మన పార్టీకి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మనం ఓడిపోయింది స్వల్ప ఓట్ల తేడాతోనే. పార్టీ లో చెత్త అంతా వెళ్లిపోతోంది. నిఖార్సైన పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్లకు పార్టీ అండగా ఉంటుంది. పార్టీ వదిలి వెళ్లిన వాళ్లు మళ్లీ పార్టీ గెలిచాక వస్తా అంటే కాళ్లు పట్టుకున్న తీసుకునేది లేదు.” అని కేటీఆర్‌ వెల్లడించారు.